రాయలసీమ : బాబాయ్ హత్యలో బాబాయ్ అరెస్ట్

Vijaya




వినటానికే విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో బాబాయ్ వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టుచేసింది. ఆదివారం ఉదయం పులివెందులలోని భాస్కర్ ఇంటికి సీబీఐ వెళ్ళి అరెస్టుచేసింది. అరెస్టు విషయాన్ని ఆయన భార్య లక్ష్మికి సమాచారమిచ్చింది. వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు ఊహాగానం చాలాకాలంగా వినిపిస్తున్నదే. కాకపోతే ఇంతకాలానికి అరెస్టు జరిగిందంతే. తండ్రి అరెస్టయ్యారు కాబట్టి ఇక కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు మాత్రమే మిగిలింది.



నిజానికి తండ్రి, కొడుకులను సీబీఐ అరెస్టుచేయబోతోందని చాలాకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వివేకా మర్డర్ కేసులో అవినాష్ ను సీబీఐ నాలుగైదుసార్లు హైదరాబాద్ లో విచారించింది. అలాగే భాస్కర్ ను కూడా రెండుసార్లు విచారించింది. విచారణకు పిలిచినపుడల్లా అరెస్టు ఖాయమంటు మీడియాలో గోలగోలైపోయేది. అయితే అప్పుడు విచారణచేసి పంపేసిన సీబీఐ  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భాస్కర్ ను అరెస్టుచేయటం విచిత్రమే.



తనను  అరెస్టు చేయటానికి సీబీఐ ప్లాన్ చేసిందని అందుకు తాను కూడా సిద్ధంగానే ఉన్నట్లు ఆమధ్య భాస్కర్ ప్రకటించిన విషయం తెలిసిందే.  వివేకా దగ్గర డ్రైవర్ గా పనిచేసి మానేసిన అప్రూవర్ దస్తగిరి వాగ్మూలం కారణంగానే తమను సీబీఐ విచారిస్తోందని తండ్రి, కొడుకులు వాదిస్తున్నారు. హత్యలో పాల్గొన్న దస్తగిరి వాగ్మూలాన్ని సీబీఐ నమ్మి తమపై కేసులు పెట్టి ఇరికించేందుకు కుట్రచేస్తున్నట్లు తండ్రి, కొడుకులు కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులు విచారణ జరగుతున్నాయి.



మొత్తానికి ఎప్పుడెప్పుడా అని చాలామంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భాస్కర్ అరెస్టు ఆదివారం తెల్లవారి జరిగిపోయింది. ఆయన దగ్గరున్న సెల్ ఫోన్ను కూడా సీబీఐ స్వాధీనం చేసుకున్నది.  అరెస్టుచేసిన భాస్కర్ ను సీబీఐ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండుకు పంపారు. భాస్కర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  ఇదే సమయంలో భాస్కర్ కూడా బెయిల్ కు దరఖాస్తు చేసుకోబోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే. భాస్కర్ అరెస్టు జరిగిపోయింది కాబట్టి ఇక ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: