అమరావతి : టీడీపీకి ఎప్పటికైనా ఎన్టీయారే దిక్కా ?

Vijaya


తెలుగుదేశంపార్టీ వ్యవహారం చాలా విచిత్రంగా తయారైవుతోంది. ఎన్టీయార్ పేరు ప్రస్తావన లేందే పాదయాత్రలో  నారా లోకేష్ అడుగు ముందుకు పడటంలేదు. చంద్రబాబునాయుడు ఏమో పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ పేరును జపం చేస్తున్నారు. లోకేష్ ఏమో జూనియర్ ఎన్టీయార్ ను పదేపదే ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఎన్టీయార్, జూనియర్ పేర్లను ప్రస్తావించటం తండ్రి, కొడుకులిద్దరికీ ఇష్టంలేదన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళ పేర్లను జపం చేయకపోతే టీడీపీ ముందుకెళ్ళలేకపోతోంది.



చంద్రబాబు ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు పదేపదే జూనియర్ ప్రస్తావన తెస్తున్నారు. దాంతో చంద్రబాబులో లోలోపల అసహనం పెరిగిపోతున్నా పైకి మాత్రం ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అందుకనే కార్యక్రమం ఎక్కడ మొదలుపెట్టినా ఎన్టీయార్ పేరును పదేపదే పలవరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవినుండి దింపేసి, పార్టీ లాగేసుకుని ఎన్టీయార్ మరణానికి కారకుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు నిజంగా ఎన్టీయార్ పేరును ప్రస్తావించక తప్పకపోవటం శాపమనే చెప్పాలి.



ఇక లోకేష్ విషయం చూస్తే పాదయాత్ర మొదలుపెట్టిన రోజునుండి ఎక్కడకు వెళ్ళినా జూనియర్ ప్రస్తావన వినిపిస్తునే ఉంది. జూనియర్ ను పార్టీలోకి తీసుకురాకపోతే పార్టీకి భవిష్యత్తు లేదని కార్యకర్తలు, జూనియర్ అభిమానులు నానా రచ్చచేస్తున్నారు. జూనియర్ పేరును పలకటం కూడా లోకేష్ కు ఇష్టముండదు. 2009 ఎన్నికల ప్రచారం తర్వాత జూనియర్ పేరు పార్టీలో ఎక్కడా వినపించకుండా చంద్రబాబు అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పార్టీ ఘోరపరాజయం తర్వాత బుచ్చయ్యచౌదరి లాంటి సీనియర్ మోస్ట్ నేతలే జూనియర్ రాకపోతే పార్టీ బతకదని తేల్చేశారు.



అప్పటినుండి పదేపదే జూనియర్ పేరు పార్టీ కార్యక్రమాల్లో వినిపిస్తునే ఉంది. తాజాగా పాదయాత్రలో సోదరుడు లోకేష్ ను కలిసిన నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీయార్ సరైన సమయంలో పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని ప్రకటించాల్సొచ్చింది. పుట్టపర్తి నియోజకవర్గం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా జూనియర్ పార్టీలోకి వస్తారని చెప్పక తప్పలేదు. ఎందుకంటే పదేపదే కార్యకర్తలు జూనియర్ ను పార్టీలోకి ఎప్పుడు ఆహ్వానిస్తారంటు వెంటపడుతున్నారు. మొత్తానికి సీనియరో లేకపోతే జూనియరో ఎన్టీయారో వీళ్ళు మాత్రమే టీడీపీ దిక్కన్న విషయం అర్ధమైపోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: