గోదావరి : అగ్నిలో రాపాక ఆజ్యం పోస్తున్నారా ?

Vijaya


క్రాస్ ఓటింగ్ అనే అగ్నిలో రాపాక వరప్రసాద్ మరింత నెయ్యిపోస్తున్నట్లున్నారు. వైసీపీలో ఏదోలా సద్దుమణుగుతోందని అనుకుంటున్న క్రాస్ ఓటింగ్ వివాదం రాపాక తాజా ప్రకటనతో మరింత రాజుకుంటోంది. క్రాస్ ఓటింగ్ వివాదంపై జనసేన రాజోలు ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటేస్తే తనకు రు. 10 కోట్ల ఆఫర్ వచ్చిందని చెప్పారు. క్రాస్ ఓటింగ్ ఆఫర్ తనకే ముందు వచ్చిందని, అయితే తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు కాబట్టి ఆఫర్ ను తిరస్కరించినట్లు చెప్పారు. తాను డబ్బకన్నా జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్నట్లు చెప్పారు.నియోజకవర్గంలోని తనకు సన్నిహిత మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా ఆఫర్ వచ్చిందన్నారు. అలాగే పోలింగ్ రోజు కూడా అసెంబ్లీలో ఒక రాజుగారు ఎదురుపడి టీడీపీకి ఓటేయమని కోరినట్లు చెప్పారు. అయితే రెండుసార్లూ తాను టీడీపీ ఆఫర్ ను తిరస్కరించినట్లు ప్రకటించారు. డబ్బుకోసం క్యారెక్టర్ ను అమ్ముకునే వాడిని కాదన్నారు. క్యారెక్టర్ పోతే సమాజంలో పరువుగా ఎలా బతకగలమని ఎదురు ప్రశ్నించారు.తన దగ్గర డబ్బుండి తాను పదికోట్ల రూపాయలు వద్దనలేదని వివరించారు. సిగ్గూ, శరం వదిలేస్తే పదికోట్లు వచ్చి ఉండేవన్నారు.  ఇంతకీ టీడీపీ తరపున రాపాకకు పదికోట్ల రూపాయలు ఆఫర్ చేసిందెవరనే విషయాన్ని ఆయన చెప్పలేదు. అలాగే కేఎస్ఎన్ రాజు అనే పేరు చెప్పారు కాబట్టి ఏదో సమయంలో సదరు రాజుగారు టీడీపీ తరపున తాను ఆఫర్ ఇచ్చింది నిజమా కాదా అనే విషయాన్ని చెబుతారు. ఇప్పటికే వైసీపీలో నలుగురు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేసిన విషయమై నానా రచ్చ జరుగుతోంది.వైసీపీయేమో నలుగురిపై క్రాస్ ఓటింగ్ చేశారని అంటోంది. పైగా ఒక్కొక్కరికి రు. 15 కోట్లు ముట్టినట్లు ఆరోపిస్తోంది. వాళ్ళేమో తాము డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదని మొత్తుకుంటున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే హఠాత్తుగా ఓటుకునోటు నిజమే అని ప్రలోభాలూ నిజమే అని రాపాక మీడియాకు చెప్పటం మరో సంచలనంగా మారింది. టీడీపీకి ఓటేస్తే భవిష్యత్తులో తనకు మంచి పొజిషన్ ఉంటుందని ప్రలోభపెట్టినా తాను లొంగలేదని రాపాక స్పష్టంగా చెప్పారు. రాపాక తాజా ఆరోపణలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: