అమరావతి : క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు ఎవరు ?

Vijaya
ఎంఎల్ఏ కోటా  ఎంఎల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. అసలు గెలవటానికి బలమే లేదని అనుకున్న టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధకు అందరికన్నా అత్యధిక ఓట్లొచ్చాయి. ఏడుస్ధానాలకు ఎనిమిది మంది పోటీచేశారు. నిజానికి సంఖ్యాబలం రీత్యా ఏడు సీట్లనూ వైసీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా  గెలుచుకునే అవకాశముంది. అలాంటిది చివరి నిముషంలో టీడీపీ పోటీలోకి దిగటంతో ఎన్నిక  అనివార్యమైంది.ప్రతి ఎంఎల్సీకి 22 మంది ఎంఎల్ఏల ఓట్లు రావాల్సుండగా టీడీపీ అభ్యర్ధికి 23 ఓట్లు రావటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నా, ఏడుగురిని గెలిపించుకునేంత సంఖ్యా బలమున్నా, టీడీపీ నుండి నలుగురు ఎంఎల్ఏలు దూరమైనా కూడా వైసీపీ అభ్యర్ధుల్లో ఒకరు ఓడిపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే తన ఎంఎల్ఏల మీద జగన్ పెట్టుకున్న నమ్మకం దెబ్బతినేసింది. వైసీపీలో ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని మొదటినుండి లెక్కలోకి తీసుకోలేదు.ఈ రెండు ఓట్లు పోయినా కూడా వైసీపీ ఏడుగురు ఎంఎల్సీలను గెలుచుకునేంత బలముంది. అయితే అనూహ్యంగా రెబల్ ఎంఎల్ఏలకు తోడు మరో ఇద్దరు ఎంఎల్ఏలు కూడా టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయటమే జగన్ కు షాకిచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వసంత కృష్ణప్రసాద్, బుర్రా వేణుగోపాల్ యాదవ్, ఉండవల్లి శ్రీదేవి, మద్దాలి గిరిలో ఇద్దరు కచ్చితంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ప్రచారం పెరిగిపోతోంది. అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ మీద కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే శ్రీదేవి, వసంత, బుర్రా తాము క్రాస్ ఓటింగ్ చేయలేదన్నారు.మొన్ననే మూడు పట్టభద్రుల కోటాలోని ఎంఎల్సీ సీట్లలో ఓటమి వైసీపీని షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే. అలాంటిది ఇంతలోనే మరో ఎంఎల్సీ సీటును కూడా ఓడిపోవటమంటే గట్టి దెబ్బపడిందనే చెప్పాలి. గెలవటానికి అవసరమైన సంఖ్యా బలముండి కూడా వైసీపీ ఒక సీటును ఓడిపోవటమంటే చిన్న విషయంకాదు. మరి ఫలితాలపై పోస్టుమార్టమ్ లో కరెక్టుగా ఏమి జరిగిందనే విషయాలు బయటపడతాయి. అప్పుడు పార్టీలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: