అమరావతి : పవన్ గ్రాఫ్ పడిపోతోందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్లు బిజీగా ఉంటున్నారు. ఎక్కడో తెలుసా ? సినిమాల్లో. అవును ఒకవైపు ఎన్నికల వేడి పెరిగిపోతున్నా పవన్ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు మొత్తం నాదెండ్ల మనోహర్ కు వదిలేశారు. నియోజవర్గాల కమిటీలు వేయలేదు, బూత్ కమిటీలు లేవు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ఏమీ పట్టనట్లే ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే రాజకీయాలంటే పూర్తిస్ధాయిలో సీరియస్ నెస్ లేకపోవటమే. బహిరంగ సభంటే వస్తారు తర్వాత మాయమైపోతారు.
పవన్ రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తనపూర్తి దృష్టి మాత్రం సినిమాలే. సినిమాల గ్యాపులోనో లేకపోతే ఏదన్నా సందర్భం వచ్చినపుడు మాత్రమే పార్టీ ఆఫీసులో కనబడుతుంటారు. పవన్ చేతిలో ఇపుడు ఐదుసినిమాలు ఉన్నాయట. ఇవన్నీ షూటింగ్ అవ్వాలంటే తక్కువలో తక్కువ అంటే ఎంత స్పీడుగా పూర్తిచేసినా ఏడాదిన్నర పడుతుందట. ఒకవైపు ఎన్నికలు వస్తుంటే మరోవైపు సినిమాల్లో బిజీగా గడిపేస్తుంటే ఇక రాజకీయాలను సీరియస్ గా ఏమి తీసుకున్నట్లు ?
అధినేతే పార్టీపైన పూర్తి దృష్టి పెట్టకపోతే ఇక మిగిలిన నేతలకు మాత్రం ఏమి శ్రద్ధుంటుంది. పార్టీ మొత్తంమీద అందరికీ బాగా తెలిసిన వ్యక్తులు ఎవరంటే మొదట నాదెండ్ల మనోహర్ పేరు చెబుతారు తర్వాత నాగబాబు మాత్రమే. వీళ్ళిద్దరికీ జనాల్లో ఏమాత్రం పట్టులేదు. ఇందులో కూడా నాగబాబు నూరుశాతం పొలిటీషియన్ కాదు. ఈయన పార్టీలో తక్కువగా టీవీల్లో, ట్విట్టర్లో ఎక్కువగా కనబడుతుంటారు.
పవన్ వైఖరి గమనించిన తర్వాతే పార్టీలో చేరటానికి నేతలెవరు పెద్దగా ఇష్టపడుతున్నట్లు లేదు. జనసేనలో చేరుతారని ప్రచారం జరిగిన కన్నా లక్ష్మీనారాయణ చివరి నిముషంలో టీడీపీలో చేరిపోయారు. ఇపుడు వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం కూడా అలాగే ఉంది. కాపు ప్రముఖుల్లో పట్టుమని నలుగురు కూడా జనసేనలో చేరలేదు. ఎందుకంటే పవన్ పై నమ్మకం లేకే. తాజాగా చేరిన ఈదర హరిబాబు, టీవీ రామారావు అవుట్ డేటెడ్ పొలిటీషియన్స్ అనే చెప్పాలి. ఏరోజూ రాజకీయాలను పవన్ సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పుడో ఒకసారి రావటం జగన్ పై నోటికొచ్చింది మాట్లాడేసి వెళ్ళిపోవటమంతే. పవన్ ఈ పద్దతిలో ఉంటే పార్టీ ఇక ఏమి డెవలప్ అవుతుంది ?