అమరావతి : కాపులకు పవన్ గైడ్ లైన్స్ ఇచ్చారా ?

Vijaya
పార్టీ ఆఫీసులో కాపుసంక్షేమసేన ముఖ్యులతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ చాలా సూక్తులే చెప్పారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ విన్నతర్వాత కాపులను పవన్ అవమానించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శనివారం బీసీల సంక్షేమంపై మాట్లాడిన పవన్ ఆదివారం కాపుల ఐక్యతపైన చాలా మాట్లాడారు. ఈ సందర్భంగా కాపులకు మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేశారు.ఇంతకీ ఆ మార్గదర్శకాల్లో ఏముందంటే ఇతరులతో మంచిగా మాట్లాడాలి. నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుందట. అంటే ఇప్పటివరకు కాపులు ఇతరులతో మంచిగా ఉండటంలేదనే అర్ధం వస్తోంది. కాపులకు ఇతరకులాలతో ఏమాత్రం పడదని చెప్పారు. గోదావరి జిల్లాల్లో అనాదిగా కాపులకు బీసీలకు ముఖ్యంగా శెట్టిబలిజలకు ఏమాత్రం పడదు. దాన్ని తాను సెట్ చేసేశానని శనివారం సమావేశంలోనే పవన్ చెప్పుకున్నారు. మరి ఆదివారం మాట్లాడినపుడు కాపులకు ఇతర కులాలతో పడదని చెప్పటంలో అర్ధమేంటో.కాపుల్లో ఐక్యత లేదనటం నిజమే. ఏ సామాజికవర్గం అయితే మెజారిటిలో ఉంటుందో ఆ సామాజికవర్గంలో ఐక్యత ఉండదనేది అందరికీ తెలిసిందే.  కాబట్టి సుమారు 19 శాతం జనాభా ఉన్న కాపుల్లో ఐక్యత ఎలా ఉంటుంది ? ఎక్కడైనా జనాలు నలుగురుంటే ఒక మాట మీదుంటారు. అదే వందమంది అయితే పదిరకాల అభిప్రాయాలు వస్తాయి చివరకు భేదాభిప్రాయాలు వచ్చి గొడవలూ అవుతాయి. ఈ కారణంగానే కాపుల్లో ఐకమత్యం సాధ్యం కావటంలేదన్న చిన్న విషయం పవన్ కు తెలీదా ?చివరగా చెప్పిన మాటేమిటంటే వైసీపీకి ఎవరూ ఓటేయద్దట. ఇక్కడ గమనించాల్సిందేమంటే జనసేనకు ఓట్లేయమని పవన్ అడగలేదు, చెప్పలేదు. ఎవరికైనా వేసుకోండి కానీ వైసీపీకి మాత్రం వేయద్దన్నారు. అంటే సమావేశం ఏదైనా, వేదిక ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రమే పవన్ టార్గెట్ అనేది స్పష్టంగా బయటపడింది. ఇక్కడ పవన్ మరచిపోయిందేమిటంటే తమను ఎవరు ఆదరిస్తారని అనుకుంటే కాపు ప్రముఖులు ఆ పార్టీలో ఉంటారు. వైసీపీ కాపులను ఆదరిస్తోందని అనుకోబట్టే ఎక్కువమంది కాపు ప్రముఖులు వైసీపీలో ఉన్నారు. కాబట్టి రేపు వీళ్ళంతా మళ్ళీ వైసీపీ గెలుపుకే ప్రయత్నిస్తారు. అంతేకానీ పవన్ ఆలోచన ప్రకారం టీడీపీకి ఓట్లేసే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: