రాయలసీమ : నిజంగానే స్టీల్ సిటీ అవుతుందా ?

Vijaya


ఇల్లయినా, ఫ్యాక్టరీ అయినా నిర్మాణ పనులు మొదలుపెట్టేముందు శంకుస్ధాపన జరగటం మామూలే. కానీ నిర్మాణపనులు మొదలుకాకుండా కేవలం శంకుస్ధాపనలే జరుగుతుంటే ఎలాగుంటుంది ? లేదా ఒకే నిర్మాణానికి పదేపదే శంకుస్ధాపనలు మాత్రమే చేస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ? అవును బుధవారం జరిగిన కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జరిగిన శంకుస్ధాపన గురించే ఇదంతా. ఈరోజు జరిగిన  శంకుస్ధాపన నాలుగోది.



ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు  నియోజకవర్గంలోని కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శంకుస్ధాపన చేశారు. రు. 8800 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణం మొదలవ్వబోతోంది.  జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా జగన్ తో కలిసి భూమిపూజ చేశారు. ఇపుడు గనుక నిర్మాణపనులు మొదలైతే జగన్ చెప్పినట్లు నిజంగానే స్టీల్ సిటీ అవుతుందేమో చూడాలి.  



మొదట 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్ధాపన చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం లాంటి కొన్ని పనులు వెంటనే మొదలయ్యాయి. అయితే ఫ్యాక్టరీ యజమాని గాలి జనార్ధనరెడ్డి కేసుల్లో ఇరుక్కోవటం, కోర్టుల చుట్టూ తిరగటంతో పాటు జైలుపాలవటంతో పనులన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. 2009లో రెండోసారి సీఎం అయిన వెంటనే వైఎస్ మరణించటంతో దీన్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత జరిగిన రాష్ట్ర విభజనలో ఈ ఫ్యాక్టరీని కేంద్రమే నిర్మించాల్సుంది. అయితే నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

రెండోసారి 2018లో చంద్రబాబునాయుడు శంకుస్ధాపన చేశారు. తర్వాత చంద్రబాబు కూడా పట్టించుకోలేదు. తర్వాత ఎన్నికలు జరగటం, టీడీపీ ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. 2019 డిసెంబర్లో జగన్ మూడోసారి శంకుస్ధాపన చేశారు. కరోనా తదితర కారణాల వల్ల పనులు మొదలేకాలేదు. తర్వాత దీని అతిగతీని పట్టించుకోలేదు. మళ్ళీ ఇంతకాలానికి జిందాల్ ఆధ్వర్యంలో పనులు మొదలవ్వబోతున్నాయి. ఫ్యాక్టరీ కోసం 15 ఏళ్ళల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మూడుసార్లు శంకుస్ధాపనలు చేశారు. మళ్ళీ నాలుగోసారి భూమిపూజ జరిగింది. మరిప్పుడైనా నిర్మాణపనులు జరిగి  ఉత్పత్తి మొదలవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: