అమరావతి : ఎల్లోమీడియాకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ?
రాజధాని అమరావతిపై కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ఎల్లోమీడియా రెచ్చిపోతోంది. రెచ్చిపోతోంది అనటంకన్నా బాగా ఓవర్ యాక్షన్ చేస్తోందనటం కరెక్టేమో. రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఏమన్నారంటే ఏపీ రాజధాని అమరావతే అని చెప్పారు. విభజన చట్టం ప్రకారమే అమారవతి రాజధానిగా ఏర్పడిందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు.
మూడురాజధానుల కోసం జగన్ ప్రభుత్వం చేసిన చట్టంతో కేంద్రానికి సంబంధంలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా 2015లోనే నోటిఫై చేసిందని మంత్రి తెలిపారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి మాత్రమే ఉంటుందా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పలేదు. పైగా కోర్టు విచారణలో ఉన్న అంశంపై తాను మాట్లాడనని చెప్పారు. ఇందులో నిత్యానందరాయ్ చెప్పింది చాలావరకు వాస్తవాలే.
ఇపుడు ఏపీ రాజధాని ఏదంటే ఎవరైనా అమరావతనే అంటారు. ఇందులో తప్పేమీలేదు కదా. అయితే అమరావతి రాజధాని విభజన చట్టప్రకారం ఏర్పడిందని చెప్పింది మాత్రం తప్పు. ఎందుకంటే విభజన చట్టంలో రాజధాని ఏది అన్న విషయాన్ని చెప్పలేదు. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు తనిష్ట ప్రకారం మరోకమిటిని నియమించుకుని అమరావతిని రాజధానిగా సిఫార్సు చేయించుకున్నారు. అంటే అమరావతి అన్నది పూర్తిగా చంద్రబాబు చాయిస్సే కానీ విభజనచట్టానికి ఎలాంటి సంబంధంలేదు.
మూడురాజధానుల కోసం జగన్ ప్రభుత్వం చేసిన చట్టంతో కేంద్రానికి నిజంగానే సంబంధంలేదు. అలాగే మూడురాజధానుల ఏర్పాటుపై జగన్ కేంద్రాన్ని సంప్రదించలేదన్నదీ వాస్తవమే. ఎందుకంటే రాజధానిని నిర్ణయించుకునే హక్కు పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదే. ఈ హక్కుతోనే చంద్రబాబు కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించేముందు చంద్రబాబు కేంద్రం అనుమతి తీసుకోలేదు. అలాగే మూడురాజధానుల అంశం ఇపుడు కోర్టు విచారణలో ఉండటం కూడా నిజమే కదా. కేంద్రమంత్రి చెప్పిన సమాధానంలో అమరావతే రాజధానిగా ఉండాలని కానీ లేదా మూడు రాజధానులు ఉండకూడదని కానీ ఎక్కడా చెప్పలేదే. మరెందుకు ఎల్లోమీడియా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోందో అర్ధంకావటంలేదు.