రాయలసీమ : చేతులెత్తేసిన అఖిల ?

Vijaya




మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేతులెత్తేసినట్లే ఉంది. ఊరికే నోటికొచ్చిన ఆరోపణలు చేయటం ప్రత్యర్ధులు సవాళ్ళు విసిరితే అడ్డదిడ్డంగా మాట్లాడటం ఈ మాజీమంత్రికి బాగా అలవాటైనట్లుంది. ఇంతకీ విషయం ఏమిటంటే నంద్యాల నియోజకవర్గం కేంద్రంగా అఖిలప్రియ, వైసీపీ ఎంఎల్ఏ శిల్పారవి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడిపోతున్నారు. శిల్పారవి తెలుగుదేశంపార్టలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు పెద్ద బాంబు పేల్చారు.




దానికి శిల్పా కౌంటరిస్తు తన ఆరోపణలకు సమాధానం చెప్పలేక నోటికొచ్చింది మాట్లాడుతోందని, తాను టీడీపీలో చేరటానికి ప్రయత్నాలు చేశానంటున్న అఖిల అందుకు ఆధారాలను చూపించాలని సవాలు విసిరారు. దానికి సమాధానంగా అఖిల మాట్లాడిన మాటలే విచిత్రంగా ఉంది. తాము భూకబ్జాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నట్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపితే తాను కూడా వాళ్ళకి సంబంధించిన ఆధారాలను చూపుతానని ఎదురుదాడి చేయటమే విచిత్రంగా ఉంది.



అఖిలప్రియ కుటుంబం భూకబ్జాలకు పాల్పడుతోందని, అక్రమాలకు పాల్పడుతోందని ప్రత్యేకంగా శిల్పా ఆధారాలు చూపించక్కర్లేదు. ఒక భూమి వివాదంలోనే అఖిల, ఆమె భర్త, తమ్ముడు హైదరాబాద్ లోని ఒక కుటుంబాన్ని కిడ్నాపు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులోనే అఖిలకుటుంబానికి  హైకోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. కుటుంబం మొత్తం ప్రస్తుతం బెయిల్ మీదుంది. ఇవికాకుండా వీళ్ళ కుటుంబంపై హత్యకు కుట్రలాంటి అనేక కేసులున్నాయి.



అఖిల కుటుంబం మీదున్న కేసుల విషయం, వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. కాబట్టి ఈ విషయాలను ఎంఎల్ఏ ప్రత్యేకించి నిరూపించాల్సిన అవసరం ఏమీలేదు. ఇపుడు సమస్య ఏమిటంటే శిల్పా టీడీపీలో చేరటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారనేందుకు అఖిల ఆధారాలను చూపించటమే. తమగురించి శిల్పా మాట్లాడారన్న కోపంతో అఖిల ఎదురుదాడి చేయటం కోసమే టీడీపీలో చేరబోతున్నారనే మాట మాట్లాడారు. అందుకు ఆధారాలు ఎలాగూ లేవుకాబట్టే ముందు తమపైన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే తాను కూడా ఆధారాలు చూపిస్తానంటు సమర్దించుకుంటున్నారు. మొత్తంమీద అఖిల చేతులెత్తేసినట్లే అర్ధమవుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: