కోస్తా : నెల్లూరు రూరల్ అభ్యర్ధిని ఫైనల్ చేసేశారా ?

Vijaya


నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి. ముందు నెల్లూరు రూరల్ ఇన్చార్జిగాను తర్వాత రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధిగాను  నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. ఈ పరిణామం చాలా స్పీడుగా జరిగిపోయింది. బహుశా సిట్టింగ్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా ఇలాంటి పరిణామాన్ని ఊహించుండరు. తన ఫోన్ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నట్లు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి చేసిన ఆరోపణలు ఎంత సంచలనమయ్యాయో అందరికీ తెలిసిందే.



కోటంరెడ్డి ఆరోపణలు డైరెక్టుగా జగన్ను ఉద్దేశించే చేయటం పార్టీలో కలకలం రేపింది. వైసీపీలో నుండి టీడీపీలోకి మారాలని అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలతో బురదచల్లేసినట్లు అర్దమవుతోంది. తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన కోటంరెడ్డే తనపై ఫోన్ ట్యాపింగ్ లాంటి ఆరోపణలు చేస్తాడని బహుశా జగన్ ఊహించుండరు. అలాంటిది కోటంరెడ్డి ఆరోపణలపై జగన్ మండిపోయారు. దాని ఫలితమే కోటంరెడ్డి స్ధానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాలను ఇన్చార్జిగానే కాకుండా ఏకంగా  అభ్యర్ధిగానే ప్రకటించేశారు.



దాంతో ఇపుడు ఏమిచేయాలో తేల్చుకోవాల్సింది కోటంరెడ్డే. వచ్చేఎన్నికల్లో తాను టీడీపీ నుండి పోటీచేస్తానని కోటంరెడ్డి చేసిన ప్రకటనే చేటుతెచ్చిందని అనుకోవాలి. వచ్చేఎన్నికల్లో టీడీపీ నుండి పోటీచేస్తానని చెప్పకుండా ఉండుంటే వ్యవహారం వేరుగా ఉండేది. తొందరపడి ప్రకటించేసిన కోటంరెడ్డి తనకు తానే వైసీపీ నుండి దూరమైపోయినట్లయ్యింది.



ఇపుడు అభ్యర్ధిగా ఆదాలను ప్రకటించేసిన తర్వాత ఇపుడు కోటంరెడ్డి ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీలో ఉన్నంతమాత్రాన ఎలాంటి లాభముండదు. ఎందుకంటే ఇపుడు కోటంరెడ్డి వైసీపీ ఎంఎల్ఏ అనేది కేవలం సాంకేతికం మాత్రమే. వెంకటగిరిలో ఎంఎల్ఏ  ఆనం రామనారాయణరెడ్డి పరిస్ధితి కన్నా కోటంరెడ్డి పరిస్ధితి మరింత దయనీయంగా తయారైంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెద్ద జోక్ అయిపోయి అటు పార్టీలో, జనాల్లో పరువుపోతుందని కోటంరెడ్డి అనుకునుండరు. దాంతో ఇపుడు కోటంరెడ్డి వ్యవహారం రెంటికి చెడ్డ రేవడిగా తయారైందన్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: