అమరావతి : పవన్ పిరికితనం ఇప్పటికి బయటపడిందా ?

Vijaya




కావాల్సింది ధైర్యంగా అడిగేంత తెగువకూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో లేదా ? ఎంతసేపు ముసుగులో గుద్దులాటలేనా ? చెప్పదలచుకున్నది, అడగదలచుకున్న విషయాన్ని కూడా పవన్ ధైర్యంగా అడగలేకపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే  కాపులకు 5 శాతం రిజర్వేషన్ డిమాండుతో సీనియర్ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య నిరాహార దీక్ష చేయాలని అనుకున్నారు ఈరోజు నుండి. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఐదురోజుల క్రితం లేఖ ద్వారా చెప్పారు.





అయితే పాలకొల్లులోని జోగయ్య ఇంట్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే జోగయ్య వయసు 86 ఏళ్ళు. ఇంతవయసులో జోగయ్య  దీక్షలేమి చేయగలరు ? పైగా ఇంతవయసులో మాజీఎంపీకి ఏవో అనారోగ్య సమస్యలు ఉండే వుంటాయి. అందుకనే ముందుజాగ్రత్తగానే ప్రభుత్వం ఆయన్ను ఆసుపత్రికి తరలించింది. ఇదే విషయంపై  పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.





జోగయ్య దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలట. ఆయన ఆరోగ్యం విషయంలో పవన్ ఆందోళన చెందుతున్నారట. జోగయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యులు తక్షణమే చర్యలు తీసుకోవాలట. పవన్ కోరకముందే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన్ను ఆసుపత్రిలో చేర్చింది కదా. ఇక ఆయన ఆరోగ్యం సంగతి ఆసుపత్రిలో డాక్టర్లు చూసుకుంటారు కాబట్టి పవన్ కు ఆందోళన అవసరంలేదు.





అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ రిజర్వేషన్ల డిమాండుతో అయితే జోగయ్య దీక్షకు కూర్చుంటానని చెప్పారో అదే రిజర్వేషన్ల గురించి అడగటానికి పవన్ కు ధైర్యం సరిపోలేదు. జోగయ్య ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్లు పవన్ ఎందుకు ఇవ్వలేకపోయారు ? కాపులకు 5 శాతం రిజర్వేషన్లు వెంటనే వర్తింపచేయాలని పవన్ ధైర్యంగా జగన్ను ఎందుకు డిమాండ్ చేయలేకపోయారో అర్ధంకావటంలేదు. స్వయంగా కాపు అయ్యుండి కూడా కాపులకు రిజర్వేషన్ వర్తింపచేయాలని అడిగేంత ధైర్యం పవన్లో కనబడటంలేదు. కాపులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తే మిగిలిన వాళ్ళంతా దూరమైపోతారని పవన్ భయపడుతున్నట్లుంది.  అంతేకానీ కాపు సామాజికవర్గానికి అవసరమైన డిమాండ్లను మాత్రం పవన్ చేయలేకపోతున్న విషయం స్పష్టంగా బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: