ఉత్తరాంధ్ర : విశాఖకు రాజధాని వెళ్ళేదెప్పుడో తెలుసా ?
ఢిల్లీలో నరేంద్రమోడీని కలిసి వచ్చిన దగ్గరనుండి జగన్ మంచి హుషారుగా ఉన్నారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ అని అనుకోవాలి. బహుశా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే విషయంలో జగన్ ప్రధానమంత్రి నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లే ఉంది. ఇప్పటివరకు జరిగిన విషయాలను చూస్తే జగన్ నిర్ణయాలకు కేంద్రప్రభుత్వం మద్దతుగానే నిలబడినట్లు అనిపిస్తోంది. హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లను చూసిన తర్వాత అందరికీ ఇదే అభిప్రాయం కలిగింది.
కాకపోతే బహిరంగంగా ఎక్కడా జగన్ నిర్ణయాలకు మద్దతు ప్రకటించలేదు. ఇక్కడే కొంతమందిలో కాస్త అయోమయం కనబడుతోంది. ఇపుడు మూడు రాజధానుల కాన్సెప్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఆ విషయం ఆచరణలో కనబడాలి. అదిగనుక కంటికి కనబడితే ఇక జగన్ కు అడ్డన్నదే ఉండదు. ఇపుడు బొత్సా మాట్లాడుతు మూడునెలల్లో విశాఖ రాజధాని అయిపోతుందని అన్నారంటే జగన్ నుండి సమాచారం లేకపోతే చెప్పరు.
అలాగే కేంద్రం గ్రీన్ సిగ్నల్ లేకపోతే జగన్ కూడా మంత్రులకు సంకేతాలు ఇచ్చే అవకాశంలేదు. సో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తాజాగా బొత్సా చేసిన ప్రకటన ఆచరణలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బొత్సా చెప్పినట్లు రాజధాని మార్చిలో విశాఖకు వెళిపోతే అప్పటినుండి జగన్ పాలనలో మరింత దూకుడు కనబడటం ఖాయమనే అనుకోవాలి. జనవరి చివరలో మూడు రాజధానులపై సుప్రింకోర్టు విచారణుంది. మరి కోర్టు ఏమిచెబుతుందో చూడాల్సిందే. ఇప్పటికైతే ప్రభుత్వ నిర్ణయాలకే మద్దతున్నట్లు అనుకుంటున్నారు. చూడాలి చివరకు ఏమవుతుందో ?