అమరావతి ఈ నియోజకవర్గాల్లో చంద్రబాబు సక్సెస్ అవుతారా ?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చితీరాలని చంద్రబాబునాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. వయసురీత్యా చూస్తే చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలయ్యే అవకాశాలున్నాయి. అందుకనే గతంలో ఎప్పుడూలేనంతగా హడావుడి చేస్తున్నారు. మామూలుగా నామినేషన్ గడువు 24 గంటల్లో ముగుస్తుందనగా టికెట్లు ఖరారుచేసి బీఫారాలివ్వటం చంద్రబాబుకు బాగా అలవాటు. కానీ గతానికి భిన్నంగా అభ్యర్ధులను ఇపుడే ప్రకటించేస్తున్నారు. ఇప్పటికి 110 నియోజకవర్గాలను సమీక్షించిన చంద్రబాబు సుమారు 20 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు.
ఇదంతా పక్కనపెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో కడపజిల్లాలో కనీసం ఐదునియోజకవర్గాల్లో గెలిచితీరాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలని చంద్రబాబు పదే పదే చెబుతున్నారుకానీ అది జరిగే అవకాశాలు దాదాపు లేవని అందరికీ తెలిసిందే. కుప్పంలో తనను ఓడించాలని జగన్ గట్టిగా చెబుతున్నారు కాబట్టి చంద్రబాబు కూడా పులివెందులలో జగన్ను ఓడించాలంటున్నారంతే.
పులివెందుల విషయాన్ని వదిలేస్తే ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచితీరాల్సిందే అని బాగాపట్టుదలగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో అధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని తమ్ముళ్ళంతా అడ్వాంటేజ్ తీసుకోవాలని పదేపదే చెబుతున్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎంఎల్సీ రమేష్ మధ్య విభేదాలున్నమాట వాస్తవమే. ఇదికాకుండా జమ్మలమడుగు, రాజంపేట, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో చంద్రబాబు అనుకుంటున్నంత గొడవలైతే లేవు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా టీడీపీ అభ్యర్దుల గెలుపుకు సహకరించేంత స్ధాయి గొడవలైతే వైసీపీలో లేవు. ఇదే సమయంలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో టీడీపీ నేతలమధ్య కూడా టికెట్ల విషయంలో విభేదాలున్నాయి. టికెట్ల విషయంలో నేతలమధ్య విభేదాలకు కొన్ని నియోజకవర్గాల్లో రెండుపార్టీలు అతీతం ఏమీకాదు. చంద్రబాబు చెప్పినా మాటవినని తమ్ముళ్ళు చాలామందే ఉన్నారు. అదే వైసీపీలో జగన్ మాటను కాదని గొడవలు పడే నేతల సంఖ్య చాలాతక్కువ. మాట వినటంలేదనే ముగ్గురు నేతలను జగన్ పార్టీనుండి సస్పెండ్ చేశారు. దాంతో మిగిలిన నేతలంతా దారిలోకి వచ్చారు. మరి కడప జిల్లాలో చంద్రబాబు తన టార్గెట్ రీచవుతారా ?