అమరావతి : టీడీపీ-జనసేన కలిస్తే జరిగేదిదేనా ?
తమరెండు పార్టీలు కలిస్తే కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చాలా బలంగా నమ్ముతున్నారు. అయితే బీజేపీని దూరంగా ఉంచితే తమకు ఎక్కడ సమస్యలు వస్తాయో అన్న ఆలోచనతో కమలంపార్టీతో కూడా పొత్తుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పొత్తువల్ల టీడీపీకి ఓట్లువచ్చి పడిపోతాయని చంద్రబాబు అనుకోవటంలేదు. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ నుండి ఎలాంటి సహకారం అందకుండా అడ్డుకోవటమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యూహం.
సరే బీజేపీ వీళ్ళతో కలుస్తుందో లేదో తెలీదుకానీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు పాయింట్ ఏమిటంటే ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి వచ్చేస్తాయా ? రాజకీయాల్లో 2+2= 4 అని మ్యాథ్స్ లో చెప్పినట్లుండదు. రాజకీయాల్లో 2+2= 4 అవ్వచ్చు లేదా జీరో కూడా కావచ్చు. పోయిన ఎన్నికల్లో విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, రాజధాని జిల్లాల్లో టీడీపీ గెలుపుపై కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం చూపించింది.
టీడీపీ అభ్యర్ధుల మీద గెలిచిన వైసీపీ అభ్యర్ధులకు వచ్చిన మెజారిటి కన్నా జనసేన అభ్యర్ధులకు పోలైన ఓట్లు ఎక్కువ. పైన చెప్పిన జిల్లాల్లో సుమారు 24 నియోజకవర్గాల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. అలాగే నరసాపురం, అమలాపురం, భీమవరం నియోజకవర్గాల్లో టీడీపీకన్నా జనసేనకే ఎక్కువ ఓట్లొచ్చాయి. సో ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాతే చంద్రబాబు, పవన్ లో 2024 ఎన్నికల్లో వైసీపీని ఈజీగా ఓడించ వచ్చనే ఆలోచన మొదలైంది. అయితే రాయలసీమలో జనసేన ప్రభావం దాదాపు నిల్లు.
అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసీపీకి 151 సీట్లొచ్చాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారు. లబ్దిదారుల సంఖ్య కోట్లలో ఉంది. రేపటి ఎన్నికల్లో వీళ్ళంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలీదు. అలాగే టీడీపీ-జనసేన మధ్య ఓట్ల బదిలీ పెద్ద సమస్య. కాపులకు బీసీలకు ఉభయగోదావరి జిల్లాల్లో ఏమాత్రం పడదు. బీసీలు ఒకపార్టీకి మద్దతిచ్చినట్లుగా కాపులు ఒకేపార్టీకి మద్దతిచ్చిన చరిత్రలేదు. రెండుపార్టీలు కలిస్తే కొంత ఉపయోగం ఉండచ్చేమోకానీ అధికారంలోకి వచ్చేస్తాయని గ్యారెంటీ మాత్రంలేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.