అమరావతి : సర్వేలో టీడీపీ పరిస్ధితి ఏంటో తెలుసా ?
ఎన్నికలు ఇంకా కొంతదూరంగానే ఉన్నా సర్వేలు అయితే జరిగిపోతునే ఉన్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించుకుంటుంటే మరోవైపు చంద్రబాబునాయుడు కూడా సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవటం ఇద్దరికీ చాలా చాలా కీలకం. జగన్ గెలిస్తే చంద్రబాబు వయసును దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశంపార్టీ దాదాపు కనుమరుగైపోవటం ఖాయం. అదే చంద్రబాబు గెలిస్తే జగన్ ఐదేళ్ళు కష్టపడాల్సిందే తప్పదు.
సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే పార్టీలో నేతల పరిస్ధితి ఏమిటి ? అనే విషయమై అంతర్గతంగా సర్వే చేయించుకున్నారు. లేటెస్టుగా వచ్చిన రిపోర్టు ప్రకారం అంత అశాజనకంగా లేదని సమాచారం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసుకుని ఒక్కో అధ్యక్షుడని నియమించుకున్నారు. ఇప్పటికిమూడేళ్ళయినా తమ్ముళ్ళపనితీరులో పెద్దగా మార్పురాలేదు. నేతల్లో మార్పురాకపోతే కచ్చితంగా కొత్త అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటానని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ఎంతగా చెబుతున్నా చాలామంది పట్టించుకోవటంలేదు. ఇదే విషయం తాజా సర్వేలో బయటపడిందట. 25 పార్లమెంటు స్ధానాల జిల్లాలకు గాను 9 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మాత్రమే పార్టీ పరిస్ధితి ఆశాజనకంగా ఉందట. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నేతల పనితీరు అంతంతమాత్రంగానే ఉందని తేలింది. మిగిలిన 11 పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఏమాత్రం బాగాలేదని అర్ధమైంది.
అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి కన్వర్టు చేసుకుంటే 112 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఏమీ బావోలేదని సర్వేలో తేలింది. మిగిలిన 63 నియోజకవర్గాల్లో బాగుందట. ఇదే విధమైన పద్దతి రేపటి ఎన్నికల్లో ఎలా మారిపోతుందో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. పార్టీ పరిస్ధితి 63 నియోజకవర్గాల్లో బాగుందుంటే ఈ నియోజకవర్గాల్లో గెలిచిపోతుందని అర్ధంకాదు. ఈ నియోజకవర్గాల్లో పార్టీనేతలు చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లుగా పనిచేస్తున్నట్లంతే. వీరికే టికెట్లిస్తే ఎంతమంది గెలుస్తారనేది కీలకం. ఇదే సమయంలో 112 నియోజకవర్గాల్లో పార్టీనేతల పనితీరు బాగాలేదంటే ఎట్టి పరిస్ధితుల్లోను గెలవరనే అర్ధంచేసుకోవాలి.