రాయలసీమ : జేసీ విషయంలో ప్రభుత్వం తెలివిగా వ్యవహరించిందా ?

Vijaya






తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకరరెడ్డి విషయంలో రాష్ట్రప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించిందనే చెప్పాలి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత తెలివిగా వ్యవహరించటం తక్కువనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే లారీ, బస్సు స్క్రాపు కొనుగోలు, బస్సు బాడీ తగిలించటం, వాటిని రిజిస్ట్రేషన్లు చేయించటం, దొంగ బీమా చేయించటం, వీటన్నింటికీ అవసరమైన సంతకాలను ఫోర్జరీ చేయటం లాంటి అనేక ఆరోపణలను జేసీ ఎదుర్కొంటున్నారు.



వీటిపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండురోజులుగా జేసీ విచారిస్తోంది. అనంతపురం పోలీసులు జేసీ మీదున్న ఆరోపణలకు ఆధారాలను సంపాదించి చార్జిషీటు దాఖలు చేయటానికి కోర్టు పర్మీషన్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇపుడు ఈడీ విచారణలో జేసీ మనీ ల్యాండరింగుకు పాల్పడిన కోణంలో దర్యాప్తుచేస్తోంది. జేసీ పైనున్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు కానీ లేదా సీఐడీ అధికారులు కానీ విచారణ మొదలుపెట్టుంటే టీడీపీ నానా గోల చేస్తుండేది.



జేసీపై జగన్ కక్షసాధింపులని, వేధింపులంటు ఎల్లోమీడియాలో కథలు, కథలుగా వండి వార్చేవారు. అదే ఇపుడు విచారిస్తున్నది ఈడీ కాబట్టి ఒక్కటంటే ఒక్క వ్యతిరేక వార్తలేదు, ఒక్క నేత కూడా నోరిప్పిన పాపాన పోలేదు. ఈడీ అనేది కేంద్ర దర్యాప్తు సంస్ధ కాబట్టి ఈడీపైన ఏమైనా ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా డైరెక్టుగా హోంశాఖ మంత్రి అమిత్ షా పైన చేసినట్లే. ఈ విషయం తమ్ముళ్ళకి, ఎల్లోమీడియాకు బాగా తెలుసుకాబట్టే కిక్కురుమనకుండా కూర్చున్నారు.



జేసీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను రాష్ట్ర పోలీసులే ఈడీకి అందచేసి విచారణ చేయాలని కోరారట. అన్నీ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకున్న తర్వాతే ఈడీ ఉన్నతాధికారులు రంగలోకి దిగారట. అందుకనే జేసీ కూడా విచారణ తర్వాత వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. రెండురోజులు వరసగా విచారించిన ఈడీ తొందరలోనే అరెస్టు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అప్పుడు కూడా చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా నోరెత్తేందుకు సాహసించరు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: