అమరావతి : 2024 పవన్ కు డెడ్ లైనా ?
భీమ్లా నాయక్ @ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటే కొంతకాలానికి జనాలకు పిచ్చెక్కటం ఖాయం. సినీ సెలబ్రిటీ హోదాలో రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా మీడియా ఆయనేం మాట్లాడినా కవర్ చేయాల్సొస్తోంది. దానికితోడు జగన్మోహన్ రెడ్డి పూర్తిస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎల్లోమీడియా భుజానేసుకుని విపరీతమైన కవరేజి ఇస్తోంది. దాంతో పవన్ ఇంకా రెచ్చిపోతున్నారు.
అయితే ఈ రెచ్చిపోవటంలో ఎప్పుడేం మాట్లాడుతున్నారో చివరకు పవన్ కు తెలీటంలేదు. కడప జిల్లా సిద్ధవటంలో మాట్లాడిందే తాజా ఉదాహరణ. తాను కులాన్ని అమ్ముకోవటానికో లేకపోతే కులాల గురించి మాట్లాడటానికో రాజకీయాల్లోకి రాలేదన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన కాపులను బీసీల్లో చేరుస్తాననే హామీకి తాను పూచీగా ఉంటానని పవన్ చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
చంద్రబాబు ఇచ్చిన హామీ పూర్తిగా తప్పుడు హామీ అని అందరికీ తెలుసు. అలాంటి తప్పుడు హామీకి పూచీగా ఉంటానని పవన్ హామీ ఇవ్వటం కులరాజకీయం కాదా ? తప్పుడు హామీకి కాపులతో టీడీపీకి ఓట్లేయించటమంటే కులాన్ని అమ్మేసుకోవటమే. ఇక కులరాజకీయాలు చేయటానికి రాలేదన్నది కూడా పూర్తి అబద్ధం. కాపులు, బలిజలు ఐకమత్యంగా ఉండాలని ఇచ్చిన పిలుపులను ఏమంటారు ? ప్రతి ఒక్కళ్ళల్లోను మనది అనే కులభావనుండాలని పవన్ పదే పదే చెప్పటాన్ని ఏమంటారు ?
ప్రతి సమావేశంలోను ఒకవైపు కులాల గురించి మాట్లాడుతునే మరోవైపు తాను కులరాజకీయాలు చేయటానికి రాజీకాయాల్లోకి రాలేదనిచెప్పటం పవన్ కే చెల్లింది. ఇదే సమయంలో ఆవు వ్యాసంలాగ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. రాయలసీమ నేతల్లో కులాధిపత్య ధోరణి బాగా పెరిగిపోయిందన్నారు. ఇక్కడ కూడా పవన్ చెప్పింది పూర్తిగా తప్పే. కులాదిపత్య ధోరణి ఎవరిలోను లేదు. రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలనుకోవటం ప్రతి నేతలోను ఉండే లక్షణమే. దాన్ని రాయలసీమకు మాత్రమే పవన్ ఎలా ఆపాదిస్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఏ విషయంలోను పరిజ్ఞానంలేకుండా, రోజుకో మాట మాట్లాడుతుండటం. ముందే చెప్పుకున్నట్లు 2024 ఎన్నికల వరకు పవన్ రాజకీయాన్ని భరించక తప్పేట్లులేదు.