రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. కానీ రోడ్డుపై అదృష్టం వరించింది?
సాధారణంగా లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటూ ఎంతో మంది తెగ పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందినీ అదృష్టం వెతుక్కుంటూ వచ్చి వారి జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో గడుపుతున్న ఆ వ్యక్తికి ఒక అనుకోని అదృష్టం వరించింది. ఒక్కసారిగా లక్షాధికారినీ చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా లో వెలుగు చూసింది. రాణిగంజ్ లో నివాసముండే నంది లాల్ రజాక్ అనే వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. కుటుంబ పోషణ కోసం కిరాణా కొట్టులో నెల జీతానికి పని చేస్తున్నాడు.
అయితే ఇటీవలే రోజు లాగానే అతను కొట్టు లో పనిచేయడం కోసం వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఏదో రాయి మెరుస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించిన అనంతరం అది రంగు రాయి అని భావించాడు. అయితే ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులకు చూపించాడు. అది డైమండ్ అయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. స్నేహితులను వెంటబెట్టుకుని డైమండ్ టెస్ట్ కేంద్రానికి వెళ్లి టెస్టు చేయించాడు. దీంతో అది 2.83 క్యారెట్ల వజ్రం అని అధికారులు నిర్ధారించడంతో ఎగిరి గంతేసాడు. దాని ఖరీదు 5 లక్షల వరకు ఉంటుందని.. ఇక వేలం పాటకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వేలంపాటలో వచ్చిన డబ్బును అతనికి అందజేస్తారు.