అమరావతి : ఇంతకీ పవన్ ది ఏ కులం ?
ఈ ప్రశ్న వినటానికే విచిత్రంగా ఉందా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు కులస్తుడని అందరికీ తెలిసిందే కదా అంటారా ? అవును అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే పవన్ కాపు సామాజికవర్గానికి చెందిన వాడేఅని. అయితే తాజాగా బీజేపీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ మాత్రం పవన్ కల్యాణ్ కు ప్రపంచ వైశ్యుల సంఘంలో సభ్యత్వం ఇచ్చేశారు. ఆ విషయాన్ని స్వయంగా టీజీయే ప్రకటించారు. ఆదివారం శంషాబాద్ లో జరిగిన వరల్డ్ ఆర్యవైశ్య మహా సభ(డబ్ల్యూఏఎం) జరిగింది.
డబ్ల్యూఏఎం మహాసభకు పవన్ తో పాటు బీజేపీ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులు హాజరవుతారని చెప్పిన టీజీ ప్రత్యేకంగా పవన్ పేరు మాత్రం ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది. అసలు వైశ్య మహాసభకు పవన్ కు ఏమి సంబంధం ? ఆమధ్య పవన్ ఏదో సమావేశంలో మాట్లాడుతు తాను కాపును కాదని రెల్లి కులస్తుడనని చెప్పుకున్నారు. ఇంకో సందర్భంలో తనకు కులంలేదు, మతంలేదని ప్రకటించుకున్నారు. దాంతో పవన్ కాపా లేకపోతే రెల్లి కులస్తుడా ? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఈ గందరగోళం సరిపోదన్నట్లుగా తాజాగా పవన్ను వైశ్య కులస్తుడిని చేసేశారు. మామూలుగా ఏ కులమైనా సరే సమావేశం నిర్వహించుకుంటే మరో కులస్తుడిని రానివ్వరు. కుల సమావేశాలు కాదు చివరకు కులాల వారీగా జరుగుతున్న వనభోజనాలకు కూడా మరో కులస్తుడు వస్తే ఒప్పుకోరు. అలాంటి ఎంతో ఖర్చుపెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు టీజీ చెప్పిన డబ్ల్యుఏఎం మహాసభకు వైశ్యుడు కానీ పవన్ను ఎలా ఆహ్వానించారు ?
సరదాగానే అయినా ఇపుడీ విషయంలోనే పవన్ ది అసలు ఏ కులమనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. జన్మతహా పుట్టిన కాపా ? లేకపోతే తానే స్వయంగా ప్రకటించుకున్న రెల్లా ? అదీకాకపోతే టీజీ ఆపాదించినట్లు వైశ్య కులమా ? ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పవనే స్వయంగా మరోసారి తన సామాజికవర్గంపై స్పష్టంగా ప్రకటన చేస్తే బాగుంటుందేమో.