అమరావతి : జనసేన బయటకు రావటం కష్టమేనా ?

Vijaya




నానాటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు సీనియర్ నేతలు కూడా భ్రమల్లో కూరుకుపోతున్నారు. ఎన్నికలు వచ్చేసినట్లు, పోలింగ్ అయిపోయినట్లు, జనసేన బంపర్ విక్టరీతో అధికారంలోకి వచ్చేసి పవన్ సీఎం అయిపోయినట్లుగా  భ్రమల్లో బతికేస్తున్నారు. దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ట్వీటే నిదర్శనం. ఆయనేమంటారంటే ‘ ‘అధికారంలో లేకుండానే ఇన్నిచేస్తున్న పవన్ కల్యాణ్ ఇక అధికారంలోకి వస్తే’





అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అమలుచేయబోయే షణ్ముఖ వ్యూహంతో రాష్ట్రం అప్పుల్లేని రాష్ట్రంగా మారిపోతుందట. ఇప్పటికే ప్రజల్లో మార్పు మొదలైందని, పవనే కాబోయే ముఖ్యమంత్రని బొలిశెట్టి పదే పదే చెప్పేస్తున్నారు. ఆయన ట్వీట్ విషయం చూస్తే అధికారంలో లేకుండానే ఇన్నిచేస్తున్న పవన్ అధికారంలోకి వస్తే.. అధికారం లేకుండా పవన్ ఇప్పటివరకు చేసిందేముంది ? మహాఅయితే ఆత్మహత్యలు చేసుకున్నారంటు కొందరు కౌలురైతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల సాయం అందిచారంతే.





కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం నిజంగా అభినందనీయమే. కానీ అవే కుటుంబాలు తమకు ప్రభుత్వం నుండి కూడా సాయం అందుతున్నాయని చెబుతున్నాయి కదా. ఇక షణ్మఖ వ్యూహం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. బలమైన పారిశ్రామిక విధానం, సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, రాష్ట్రాన్ని అభ్యుదయ రాష్ట్రం మారుస్తారట. రాయలసీమలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారట. యువత పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఉపాధి కల్పించేందుకు తలా రు. 10 లక్షలుఇస్తారట.





పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే షణ్ముఖ వ్యూహంలో చెప్పినవి చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాల్సిందే. డబ్బు కావాలంటే అప్పులు చేయాల్సిందే. ఎందుకంటే ఒకవేళ పవన్ అధికారంలోకి వస్తే అప్పటికి రాష్ట్రఅప్పు సుమారుగా 9 లక్షల కోట్లకు చేరుంటుంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం పగ్గాలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగే పవన్ అయినా అప్పులు చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. కాబట్టి పవన్ అండ్ కో ముందు భ్రమల్లో నుండి బయటకు రావాలి. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని కాకుండా ముందు అధికారంలోకి వచ్చే మార్గం చూసుకుంటే అదే పదివేలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: