ఢిల్లీ : డ్రాగన్ పెద్ద వ్యూహంతోనే రెడీ అవుతోందా ?

Vijaya




భారత్ వాస్తవాధీన రేఖ వెంబడే డ్రాగన్ చాలా పెద్ద వ్యూహమే పన్నుతున్నట్లుంది. ఉండి ఉండి హఠాత్తుగా మన భూభాగంపైన విరుచుకుపడినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే వాస్తవాధీన రేఖ వెంబడే జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండేళ్ళక్రితంతో పోల్చిచూస్తే ఇపుడు తన సైన్యాన్ని విపరీతంగా పెంచేసింది. అలాగే అత్యంత ఆధునిక వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంటోంది. భారీ ఎయిర్ స్ట్రిప్ రెడీ అవుతోంది.




ఇదాం సరిపోదన్నట్లు చాలా పెద్ద గోడౌన్లను నిర్మిస్తోంది. మిస్సైల్స్ బ్లాస్ట్ ప్రూఫ్ బంకర్లను విపరీతంగా ఏర్పాటుచేసుకుంటోంది. ఇవే కాకుండా మౌంటెన్ ట్యాంకర్లను, అత్యంతాధునిక ట్యాంకర్లను మోహరించింది. ఇది సరిపోదన్నట్లుగా 25 ఫైటర్ జెట్లను మోహరించింది. దీనికి ఏ క్షణమైనా బిగించేందుకు, ప్రయోగించేందుకు  వీలుగా మిస్సైల్స్ ను కూడా రెడీ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా ఆర్మీ మధ్య ముష్ఠియుద్ధం జరిగిన విషయం అందరికీ గుర్తుండేవుంటుంది.




ఆ ప్రాంతంలో అప్పట్లో కేవలం 20 వేలమందిని మాత్రమే ఉంచింది. అలాగే 20 వేలమందికి సరిపడా సౌకర్యాలను, వ్యవస్ధలను మాత్రమే రెడీచేసుకుంది. కానీ ఇప్పుడు 1.2 లక్షల మందిని తీసుకొచ్చింది. వీళ్ళందరికీ అత్యంత సురక్షితమైన, ఆధునికమైన వసతులను ఏర్పాటుచేసింది. సైన్యానికి 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉండేలా సోలార్ పవర్, హైడల్ పవర్ ప్రాజెక్టులను కూడా రెడీచేసింది. ఇలాంటి ఏర్పాట్లన్నీ ఏడాదిన్నర క్రితం లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి.




సైన్యం చేతికి అత్యంతాధునికమైన మెషీన్ గన్లను అందించిందట. నైట్ వ్యూ గ్లాసెస్, గన్స్ కూడా అందించింది. జరుగుతున్నది చూస్తుంటే ఏదోరోజు హఠాత్తుగా మన సైన్యంపై విరుచుకుపడటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కావాలనే శతృసైన్యాలను కవ్వించటం, రెచ్చగొట్టడం తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడేట్లుగా ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నది మన నిఘా వ్యవస్ధ. అయితే ఇదంతా చూస్తు కూర్చోలేదు మన సైన్యం. ఎప్పటికప్పుడు డ్రాగన్ కదలికలను గమనిస్తునే ఉన్నది. మరి చివరకు ఏమవుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: