అమరావతి : ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా ?
ఉట్టకి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానని అన్నదట అన్న సామెతలో చెప్పినట్లే ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం. నిజంగా పవన్ కు ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన పార్టీ ఎన్నికల చిహ్నంగా చెప్పుకునే గాజుగ్లాసును కేంద్ర ఎన్నికల కమీషన్ వేరే అభ్యర్ధికి కేటాయించింది. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా ఇలాగే ఇంకో అభ్యర్ధికి కేటాయించిన సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లాలో జరగబోతున్న ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షెక్ జలీల్ కు ఎన్నికల కమీషన్ గాజుగ్లాసు చిహ్నాన్ని కేటాయించింది. ఏదైనా పార్టీకి ఒక ఎన్నికల చిహ్నం స్ధిరంగా ఉండాలంటే సదరు పార్టీ సాధించాల్సిన ఓట్లు, సీట్ల విషయంలో ఎన్నికల కమీషన్ స్పష్టంగా నిబంధనలు రూపొందించింది. కమీషన్ చెప్పిన నిబంధనలకు జనసేనకు ఏ రకంగా కూడా దగ్గరలోలేదు.
ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జనసేన గెలిచిందే ఒక్కసీటు. ఇదే సమయంలో జనసేన కూటమికి వచ్చిన ఓట్లు 5.6 శాతం. కూటమికి వచ్చిన ఓట్లశాతంలో పార్టీల వారీగా తీసేస్తే జనసేనకు వచ్చిన ఓట్లెంతో తేలుతుంది. అందుకనే జనసేనకు గాజుగ్లాసు చిహ్నాన్ని ఎన్నికల కమీషన్ రద్దుచేసింది. అంటే గాజుగ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. నామినేషన్ ఎవరు ముందువేస్తే, గాజుగ్లాసు చిహ్నాన్ని ఎవరు ముందుగా కోరుకుంటే కమీషన్ వారికే గాజుగ్లాసును కేటాయిస్తుంది.
జనసేన అదృష్టం ఏమిటంటే 2019 తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లోను పార్టిసిపేట్ చేయలేదు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా గాజుగ్లాసు దొరకలేదు. స్ధానికసంస్ధల ఎన్నికలు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి అర్జంటుగా పవన్ చేయాల్సిందేమంటే ముందు తమ ఎన్నికల చిహ్నమైన గాజుగ్లాసును ఎలా తమకు మాత్రమే పర్మనెంటుగా ఉంచుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం, ముఖ్యమంత్రవ్వటం తర్వాత చూసుకోవచ్చు. లేకపోతే చివరకు ఎన్నికల చిహ్నానాన్ని కూడా కాపాడుకోలేని అసమర్ధుడిగా పవన్ మిగిలిపోవటం ఖాయం.