ఆర్బీఐ ఎన్టీఆర్ బొమ్మను నోటుపై ముద్రిస్తుందా?

VAMSI
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ ఉండేలా తాము ఆర్బిఐతో చర్చలు జరుపుతున్నామని త్వరలోనే అనుమతి లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు ఎన్టీఆర్ కుమార్తె, బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ కు తరలి వచ్చిన నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు పూలమాలలు వేసి అన్న ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి... ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించి అక్కడ కార్యక్రమాలు జరిగేలా చూస్తామని చెప్పారు. నాన్న గారి ఆశయం తెలుగు ప్రజల అభివృద్ధే నని మరోసారి గుర్తుచేస్తూ అందుకోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.
అన్నగారు నందమూరి తారక రామారావు తెలుగు సినీ చరిత్రలోనే ఒక మకుటం లేని మహారాజు. తెలుగు సినీ పరిశ్రమను నిలబెట్టిన దిగ్గజం అని చెప్పొచ్చు. అప్పట్లో తెలుగు సినిమాలు కూడా చెన్నై కేరాఫ్ అడ్రస్ గా ఉండగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ప్రముఖులు కలిసి తెలుగు వారికంటూ ప్రత్యేకంగా సినీపరిశ్రమ ఉండేలా చేసి హైదరాబాద్ లో సినీ పరిశ్రమ ఏర్పాటుకు పాటుపడ్డారు. ఆ విధంగా తెలుగు జనాలకు ఎంతో మేలును చేశారు నటుడు ఎన్టీఆర్. ఒక నటుడిగానే కాదు నాయకుడిగా కూడా తెలుగు ప్రజల మన్ననలు అందుకున్న మహా నాయకుడు. ఒక సినీ నటుడు ఆ స్థాయిలో ప్రజల మద్దతు పొందగలిగాడు అంటే అది అన్న ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం. సినీ పరిశ్రమ నుండి వచ్చి సొంతగా పార్టీని నెలకొల్పి ముఖ్యమంత్రి అయ్యి తన సేవలను ప్రజలకు అందించి పారదర్శక పరిపాలనలో ప్రజలతో జేజేలు పలికించుకున్నారు.
ఆ నాటి కాలంలోనే ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి తాను పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారు. కులమత వేదాలు లేకుండా తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి శతవిధాల శ్రమించారు. ఆయన కష్టాన్ని , తమకోసం పాటుపడుతున్న నాయకత్వాన్ని చూసి ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టారు ఆంధ్రులు. ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ వంటి నాయకులతో సమానంగా గొప్ప ప్రజా ప్రతినిధిగా కీర్తి ప్రతిష్టలు పొందారు ఎన్టీఆర్. అలా జనం కోసం చివరి క్షణం వరకు శ్రమించిన ఆయనంటే ఇప్పటికీ ప్రజలకు ఎంతో ప్రీతి. ఆయన స్థాపించిన తెలుగు దేశం స్థితిగతులు మారాయి కానీ ఆయన పై ప్రజలకున్న ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మరి వీరు చెబుతున్న విధంగానే ఎన్టీఆర్ బొమ్మను వందరూపాయల నోటుపై ముద్రించేందుకు అనుమతి ఇస్తారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: