రాజకీయ పరిపాలనా సంస్కర్త ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన గొప్ప రాజకీయ నాయకుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిండైన ప్రతీక. ప్రజా సేవలో ఆయన ప్రతి అడుగూ, సమజాశ్రేయస్సు కోసం చేపట్టిన ప్రతి సంస్కరణా నేటికి అజరామరం. నేడు ఆయన 99 వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఆయన ప్రస్థానం మీకోసం. 


ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో  మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ కృషి, పట్టుదల, క్రమశిక్షణలను చిన్నతనంలోనే అలవర్చుకుని తన జీవితంలో పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చారు. స్వతహాగా అందగాడు, అజనుబహుడైన ఎన్టీఆర్ విద్యార్థి దశలోనే నటన మీద ఆసక్తి ఏర్పడి నాటకాల్లో నటించడం జరిగింది. నటన మీద మక్కువతో దర్శక దిగ్గజం ఎల్వి ప్రసాద్ ఆశీస్సులతో 1949లో 'మనదేశం' చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనంతర కాలంలోనే సామాజిక, సాంఘిక , జానపద, పౌరాణికాలకు సంబంధించిన అనేక రకాల పాత్రలను పోషించి నటనలో తనకు తిరుగులేదని నిరూపించి " విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు" గా బిరుదాంకితుడైనాడు. 
ఎన్టీఆర్ తొలి నుంచి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. చిత్ర పరిశ్రమలో నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆనాటి రాయలసీమ కరువు పరిస్థితులు దృష్ట్యా ఆ ప్రాంత ప్రజల కోసం జోలె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి జోలె పట్టి ప్రజల నుండి నిధులు సమీకరణ చేసిన ఉదంతంతో పాటుగా 1977 లో వచ్చిన దివిసీమ ఉప్పెన సమయంలో సైతం తన సహా నటుడు, ఆత్మీయ మిత్రుడు ఎఎన్నార్ తో కలిసి ప్రజల వద్దకే వెళ్లి నిధులను సమీకరణ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో సామాజిక బాధ్యత కూడిన కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబడటం జరిగింది. 
సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న సమయంలోనే పీడిత , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాలని భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లోకి అడుగుపెట్టి  "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు" గా భావించి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలిరా! అన్న ఒక్క నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని సమూలంగా తనవైపు తిప్పుకున్నారు. 
తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత రాబోయే ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఎన్టీఆర్ పలు రకాల పద్దతులను అనుసరించారు. యువత ముఖ్యంగా పట్టుభద్రులకు మరియు రాజకీయంగా వెనుకబడిన వర్గాలైన బీసీ, దళితులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆరోజు ఆయన ఎంపిక చేసిన యువకులే నేడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా కొనసాగుతున్నారు.
పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో అనేక సంస్కరణలు మరియు మునుపెన్నడూ లేనటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. పేదవాడు పట్టెడన్నం తినేందుకు ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం , పేదల కోసం పక్కా గృహాలు, సగం ధరకే జనతా వస్త్రాలు, ఉపాధి హామీ పథకం, నీరు పేదలకు నెలకు 30 రూపాయల పింఛన్ , ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 వేల మంది వితంతు మహిళలకు 50 రూపాయిలు పింఛన్ , అసంఘటిత కార్మికులకు 30 రూపాయలకు పింఛన్ అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ సొంతం. 


రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, నీటి తిరువా రద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగు నీటి పారుదల వ్యవస్థ పూనర్నిర్మాణం, సన్న చిన్నకారు రైతుల భూమి శిస్తూ రద్దు ,రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన వంటి పలు కార్యక్రమాలను ఎన్టీఆర్ హయాంలోనే విజయవంతంగా అమలు చేయడం జరిగింది.  సామాన్య ప్రజానీకానికి విద్యా, వైద్య  సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యం తో ప్రతి మండల కేంద్రం లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , జిల్లా పరిషత్ హైస్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది.విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది .అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ప్రాథమిక స్కూళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సాంకేతిక , వైద్య విద్యలలో విప్లవాత్మక సంస్కరణలు , ఎంసెట్ నిర్వహణ , క్యాపిటేషన్ ఫీజుల రద్దు మొదలైనవి ఎన్టీఆర్ సాధించిన విజయాలు. తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి చేరువచేసిన ముఖ్యమైన పాలనా సంస్కరణ మండల వ్యవస్థ నిర్మాణం. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకు అప్పటి వరకు పాలన వ్యవస్థ లో బలంగా ఉన్న గ్రామ కరణాల వ్యవస్థ రద్దు ఒక సంచలనం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికార వికేంద్రీకరణతో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు, మండల యూనిట్ గా గ్రామాల అభివృద్ధికి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.  

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. దేశంలో మొదటి సారిగా ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించడంతో  
ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ 30 శాతం మహిళలకే కేటాయించారు. జిల్లా, మండల ప్రజాపరిషత్తులలో 9శాతం చైర్మన్‌ పదవులు మహిళలకే రిజర్వు చేశారు. మహిళల సంక్షేమం కోసం 14 పథకాలు, అంశాల్లో కృషిచేశారు. స్త్రీ , శిశుసంక్షేమ కార్యక్రమాలు సత్వరంగా, సక్రమంగా అమలు జరిపేందుకు మహిళాభ్యుదయ, శిశు సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు.
బడుగు ,బలహీన, అణగారిన గిరిజన, దళిత వర్గాలకు చెందిన వారికి ఆర్థిక , సామాజిక, రాజకీయ, విద్య , ఉపాధి రంగాల్లో అపారమైన అవకాశాలు, సామాజిక భద్రత కల్పించి వారి అభ్యున్నతికి  కృషి చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయల్లో మరియు పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈనాడు ఆయన స్పూర్తితో సమాజానికి సేవ చేసేందుకు ఎంతో మంది మధ్యతరగతి యువత తమ రాజకీయాల్లో వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: