అమరావతి : రాజకీయ వేడిని పెంచేస్తున్న అధినేతలు
రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాన్ ఒక్కసారిగా వేడిని పెంచేస్తున్నారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకాలముంది. అయితే ఈలోపు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చేయచ్చనే పద్దతిలో ముగ్గురు కలిసి రాజకీయ హీట్ ను పెంచేస్తున్నారు. ఇంతకాలం తాడేపల్లిలోని క్యాంపాఫీసుకు మాత్రమే పరిమితమైన జగన్ ఒక్కసారిగా జోరు పెంచారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు.
ఇక చంద్రబాబు కూడా వచ్చే నెలనుండి జనాల్లో తిరగటానికి డిసైడ్ అయిపోయారు. ఈనెల 28వ తేదీన ఒంగోలులో మహానాడు తర్వాత రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. మధ్య మధ్యలో అవసరానికి అప్పుడప్పుడు జనాల్లోకి వస్తున్నా ఎక్కువగా హైదరాబాద్ లోనే గడిపేస్తున్నారు. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జనాల్లో పర్యటిస్తున్నారు. కౌలురైతులకు పరిహారం పేరుతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇపుడు పశ్చిమగోదావరి తర్వాత కర్నూలు జిల్లాలో పర్యటనలు పెట్టుకున్నారు.
మొత్తానికి ముగ్గురు కూడా జనాల మద్దతుకోసమే పర్యటనల జోరు పెంచేస్తున్నారు. ఎక్కడ సభలు జరిగినా జగన్ మాత్రం చంద్రబాబు, పవన్+ఎల్లోమీడియాను కలిపి పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. తన పరిపాలన నచ్చితే రెండోసారి అధికారం ఇవ్వండని, నచ్చకపోతే ఓడించమని స్వయంగా జగనే ప్రజలను నరసరావుపేట బహిరంగసభలో ప్రజలకు విజ్ఞప్తిచేయటం గమనార్హం.
ఇదే సమయంలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల అమలులో ఎలాంటి అవినీతి జరగకపోవటంతో ప్రభుత్వంపై ఆరోపణలు చేయటానికి చంద్రబాబు, పవన్ కు అవకాశం లేకపోతోంది. అందుకనే జగన్ను డైరెక్టుగా ఎటాక్ చేస్తున్నారు. అప్పులు చేసేస్తున్నాడని, ఏపీని మరో శ్రీలంకలాగ తయారు చేసేస్తున్నాంటు చంద్రబాబు ఎల్లోమీడియాను ముందుపెట్టి రచ్చ చేస్తున్నారు. పవనేమో ఏమి చెప్పాలో అర్ధంకాక తనను చూసి ప్రభుత్వం భయపడుతోందంటు తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలనే రెండు రోజుల తర్వాత పవన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి జగన్ ఒకవైపు, ప్రతిపక్షాలు+ఎల్లోమీడియా మరోవైపు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలతో రాజకీయ వేడి మాత్రం బాగా పెరిగిపోతోంది.