నెల్లూరు వైసీపీ లీడర్స్ రాజీనామా... జగన్ కు షాక్ ?

VAMSI
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. జగన్ సీఎం అయిన తొలి రోజుల్లో చెప్పిన విధంగా రాష్ట్ర కాబినెట్ ను రెండు పర్యాయాలుగా విభజించారు. గత వారంలోనే మంత్రులు అందరూ తమ తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త మంత్రులు ఎవరు కానున్నారు అనే విషయం రాష్ట్రమంతా పెద్ద చర్చగా మారింది. దీనిపై గత రెండు నెలలుగా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని మీడియా చానెళ్లు అయితే కాబోయే మంత్రులు వీరే అంటూ కులసమీకరణలతో సహా లిస్ట్ విడుదల చేశారు. అయితే ఇవి కేవలం ఊహాగానాలే వాస్తవాలు కాదని నిన్న ఏపీ సీఎం జగన్ ప్రకటించిన మంత్రుల జాబితాను చూస్తే అర్ధం అయింది.
పాత మంత్రులు 11 మందిని కలుపుకుని కొత్త  వారిని 14 మందికి జగన్ అవకాశం కల్పించారు. ఆ విధంగా టర్మ్ 2 లో మొత్తం 25 మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సేవలను అందించనున్నారు. అయితే ముందు నుండి మాకు మంత్రి పదవి వస్తుంది అని ఊహించిన కొందరికి చుక్కెదురైంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్రా నెల్లూరు జిల్లా నుండి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవిని కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. ఇంతకు ముందు కాబినెట్ లో ఉన్న నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను విస్మరించగా, ఆనం రామనారాయణరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు నిరాశే ఎదురైంది.
అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం నెల్లూరు రురల్ కు చెందిన కార్పొరేటర్లు, ఎంపీటీసీ లు మరియు మిగిలిన నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు అంతా తీవ్ర నిరాశలో మునిగిపోయి ఉన్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో వీరంతా కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఎటువంటి ఫ్లాష్ న్యూస్ వినాల్సి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమీ స్పందించకపోవడం గమనార్హం. జగన్ కు ఇది షాక్ కానుందా ? ప్రస్తుతం ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: