త్వరలో పవన్ ఓదార్పు యాత్ర!

Purushottham Vinay
ఆంధ్ర ప్రదేశ్ లో ఓదార్పు యాత్ర మాట వినిపిస్తోంది. ఈసారి ఓదార్పు యాత్ర చేసేది జగన్ కాదు పవన్ కళ్యాణ్. అవును జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ యాత్రకు సిద్ధపడుతున్నారు.జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఓదార్చే పేరిట పెద్ద కార్యక్రమాన్నే చేపడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తమను ఆదుకునే వారు లేక సాగు చేయడం దండుగ అని భావించి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలని పవన్ కళ్యాణ్ ఓదార్చనున్నారు. అదే విధంగా కౌలుకు భూములు తీసుకుని నానా అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా పవర్ స్టార్ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల దాకా ఆర్ధిక సాయం కూడా చేయనున్నారు. నిజానికి ఇలా చేయడం వల్ల రైతులకు భరోసా అనేది వస్తుంది.




వెంటనే ఎంతో కొంత ఆర్ధిక సాయం కూడా అందుతుంది.అలాగే ప్రభుత్వానికి కూడా పెద్ద హెచ్చరికగా ఉంటుంది. మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నీ ఆలోచించే జనంలోకి వస్తున్నారు.ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉభయ గోదావరి జిల్లాలోనే 75 మంది దాకా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. వారిని అందరినీ పవన్ కళ్యాణ్ పలకరించబోతున్నారు. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఉన్న రైతు సోదరులను ఆదుకుంటామని చెప్పబోతున్నారు.ఇక జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసే ఓదార్పు యాత్ర త్వరలో స్టార్ట్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక ఈ తరహా యాత్రలను షురూ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న వేళ సమాజంలో అత్యంత ప్రభావిత రంగంగా ఉన్న రైతులకు ఆసరాగా ఉంటూ పవన్ కళ్యాణ్ చేసే ఈ ఓదార్పు యాత్ర జనసేన రాజకీయానికి మేలి మలుపుగా ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: