కొత్త జిల్లాలపై తేల్చుకోలేకపోతున్న సీఎం జగన్..
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. జిల్లాల పేర్లు, నియోజకవర్గాల చేర్పులు, రెవెన్యూ డివిజన్ల మార్పుపై పార్టీనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని ఆయన పరిశీలించారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో నేతలంతా సంతోషంగా ఉన్నారు.
ఈనెల 31న నోటిఫికేషన్..
ఈనెల 31న కొత్త జిల్లాలకోసం తుది నోటిఫికేషన్ ఇస్తారు. ఏపీలోని 13 జిల్లాలను 26గా మారుస్తూ ఇప్పటికే తొలి విడత నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై అభ్యంతరాలను స్వీకరించి, వాటి గురించి చర్చించి.. చివరిగా తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తుది నోటిఫికేషన్ వద్దే కాస్త చర్చ నడుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై పెద్ద వ్యతిరేకత లేకపోయినా.. అధికార పార్టీ నేతలే కొన్ని చోట్ల పట్టుబడుతున్నారు. తమ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలకు దూరం చేయడం సరికాదంటున్నారు. ఒకవేళ ఆ విషయంలో తమకు అన్యాయం జరిగితే స్థానికంగా తమపై వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. జిల్లా పేర్ల విషయంలో కూడా కొన్ని చోట్ల తీవ్ర అబ్యంతరాలున్నాయి. జిల్లా కేంద్రాల ప్రకటన కూడా ఒకటి రెండు చోట్ల గందరగోళానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అసలు అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారా లేక పెద్దగా మార్పులేవీ లేకుండానే తుది నోటిఫికేషన్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.