అమరావతి : వచ్చే ఎన్నికల్లో మంటలు మండే నియోజకవర్గాలివేనా ?
రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీచేసినా ఓడించటానికి తాను రెడీగా ఉన్నానంటూ కాకినాడ వైసీపీ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి భీషణ ప్రతిజ్ఞ చేశారు. ద్వారపూడికి పవన్ కు ఏమాత్రం పడదన్న విషయం తెలిసిందే. ద్వారపూడికి భీమ్లానాయక్ ట్రీట్మెంట్ ఎలాగుంటుందో చూపిస్తానంటు బహిరంగసభలో పవన్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ద్వారపూడి పై విధంగా రియాక్టయ్యారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరి మద్య పెద్ద యుద్ధమే జరిగేట్లుంది.
సరే వీళ్ళద్దరి వ్యవహారం వదిలేస్తే ఇలాంటి నియోజకవర్గాలే ఇంకొనున్నాయి. అవేమిటంటే కుప్పం, పుంగనూరు, గుడివాడ, పులివెందుల, కాకినాడ రూరల్, మంగళగిరి, టెక్కలి లాంటి నియోజకవర్గాల్లో మంటలు మండటం ఖాయమనే అనిపిస్తోంది. ఎలాగైనా సరే చంద్రబాబునాయుడును ఓడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదుంచారు. అలాగే పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు పుంగనూరులో పెద్దిరెడ్డి వ్యతిరేకులందరినీ ఏకం చేస్తున్నారు.
వీళ్ళద్దరి కారణంగా కుప్పూం, పుంగనూరులో మంటలుమండటం ఖాయమే. అలాగే గుడివాడలో కొడాలిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు, పవన్ ఇద్దరు కంకణం కట్టుకున్నారు. ప్రత్యేకించి టీడీపీ, జనసేనకు బలమైన క్యాండిడేట్ లేకపోయినా ఇద్దరు ఏకమై కొడాలిని ఓడించాలని డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నిక కూడా చాలా హాటుగానే ఉంటుంది. ఇక మంగళగిరి గురించి చెప్పాల్సిన పనేలదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నారా లోకేష్ కంకణం కట్టుకున్నారు.
తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే లోకేష్ గెలిచితీరాల్సిన ఎన్నికలు. అందుకనే సర్వశక్తులు ఒడ్డుతారనటంలో సందేహంలేదు. కాకినాడ రూరల్లో మంత్రి కన్నబాబును ఓడించాలని పవన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కాబట్టి ఎంతకైనా తెగిస్తారు. ఇక టెక్కలిలో అచ్చెన్నను ఓడించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీలో అంతటి ప్రాధన్యత ఉన్న నేత అచ్చెన్నే. కాబట్టి టెక్కలిలో రాబోయే ఎన్నికల్లో మంచి ఫైటే జరగటం ఖాయం. ఇలాంటివే మరికొన్ని కూడా ఉన్నాయి. మరి ఫైట్ ఎలా జరగబోతోందో చూడాల్సిందే.