అమరావతి : జగన్ ధైర్యమిదేనా ?
రాష్ట్రంలో రాజకీయ వేడి బాగా పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలక ఇంకా రెండేళ్ళుండగానే అన్నీ పార్టీల్లో పొత్తు చర్చలు పెరిగిపోతున్నాయి. అధికార వైసీపీ తప్ప మిగిలిన అన్నీ పార్టీలు ఏదోపార్టీతో పొత్తుకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే బీజేపీ+జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని తెలుగుదేశంపార్టీ ఎదురుచూస్తోంది. సరే కాంగ్రెస్, వామపక్షాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం కూడా వాటిగురించి వదిలేయటమే బెటర్.
మిత్రపక్షాలతో పొత్తుకు చంద్రబాబు ఎంతగానో తపిస్తున్నారు. వీలైతే మూడోపక్షంగా ఉండాలని లేకపోతే వాళ్ళని విడదీసీ జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందే అన్నట్లుగా ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మూడు ప్రధాన పార్టీల మధ్య పొత్తు చర్చలు ఇంతగా జరుగుతున్నాయి. మరి అధికారపార్టీ ధీమా ఏమిటి ? ఎవరితోను పొత్తు అవసరం లేదని ఒంటరిగానే పోటీచేస్తున్నట్లు జగన్ ఎంఎల్ఏల సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు.
ఒంటరిపోరులో జగన్ ధీమా ఏమిటి ? ఏమిటంటే బీజేపీ+జనసేన ఎంతగింజుకున్నా వాటికొచ్చే ఓట్లు నామమాత్రమే మహాఅయితే జనసేన కారణంగా కొన్ని ఓట్లు పెరగచ్చు. ఇక టీడీపీకి కొత్తగా యాడయ్యే ఓట్లేమీలేవు. దీని ఓటు బేస్ సుమారు 30 శాతమంతే. రేపటి ఎన్నికల్లో ఈ శాతం ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ మూడుపార్టీలు కలిసినా వచ్చే నష్టం ఏమీలేదు. ఎందుకంటే మూడుపార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగటం కష్టమే. మూడు పార్టీల అభ్యర్ధుల్లో ఏ పార్టీ అభ్యర్ధి అయితే పోటీచేస్తున్నారో మిగిలిన రెండు పార్టీల ఓటుబ్యాంకు సదరు అభ్యర్ధికి పడేది అనుమానమే.
కలగూరగంప లాంటి ప్రతిపక్షాలు ఎన్ని కలిసినా వచ్చే నష్టమేమీ లేదన్నదే జగన్ ఆలోచనట. విచిత్రం ఏమిటంటే జనసేన నేతల్లో చాలామంది+కాపునేతలు పవన్ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇక్కడే పెద్ద తేడా కొట్టేస్తుందట. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే అవకాశాలు తక్కువనే ప్రచారం ఉంది. అందుకనే 2024 ఎన్నికల్లో పోటీపై జగన్ ఇంత ధైర్యంగా ఉన్నది.