అమరావతి : జగన్ దృష్టిలో పవన్ స్ధాయి ఇదేనా ?
‘చంద్రబాబునాయుడు అనే వ్యక్తి నథింగ్..చాలా కరెక్టుగా చబుతున్నా’ ఇది తాజాగా వైసీపీ ఎంఎల్ఏల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళకుపైగా ప్రతిపక్ష నేతగా ఉంటున్న చంద్రబాబునే జగన్ చాలా సింపుల్ గా నథింగ్ అని తేల్చేశారు. చంద్రబాబు గురించి జగన్ వేసిన అంచనా నూరుశాతం నిజమేనా ? లేకపోతే చంద్రబాబు విషయంలో జగన్ చాలా ఓవర్ గా మాట్లాడారా ? అన్నది భవిష్యత్తే తేల్చాలి.
అయితే ఇక్కడ విషయం చంద్రబాబు కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే జగన్ దృష్టిలో నథింగ్ అంటే ఇక పవన్ సంగతేమిటి ? పవన్ గురించి జగన్ సమావేశంలో ఏమీ మాట్లాడలేదు. కాకపోతే మొదటినుండి పవన్ను, జగన్ అసలు పట్టించుకోవటమే లేదన్నది వాస్తవం. జగన్ ఇపుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నరోజుల్లో కూడా పవన్ను పట్టించుకోలేదు. వైసీపీ నేతల సమాచారం ప్రకారం జగన్ దృష్టిలో పవన్ అసలు నాయకుడే కాదు, జనసేన పార్టీయే కాదు.
జగన్ దృష్టిలో పవన్ అన్నా జనసేన అన్నా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేసే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) అన్నమాట. ఉదాహరణకు ఒక భారీ పరిశ్రమ ప్రత్యేకించి విదేశాలకు చెందింది మన రాష్ట్రంలో ఏర్పడాలని అనుకోండి. ఆ కంపెనీ యాజమాన్యానికి-కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిశ్రమ ఏర్పడేందుకు అవసరమైన అన్నీ అనుమతులు, వ్యవహారాలు సజావుగా చూడటం కోసం ప్రత్యేకించి ఒక వ్యవస్ధను ఏర్పాటవుతుంది. దాన్నే పారిశ్రామిక పరిభాషలో ముద్దుగా ఎస్పీవీ అంటారు. వ్యవస్ధ ఏర్పాటు లక్ష్యం తీరిపోయిందంటే ఎస్పీవీ కూడా మాయమైపోతుంది.
మళ్ళీ ఇంకోసారి పరిశ్రమ ఏర్పాటవుతోందనగానే మళ్ళీ ఎస్పీవీ ప్రత్యక్షమవుతుంది. ఇపుడు జనసేన అన్నా, పవన్ అన్నా జగన్ దృష్టిలో ఒక ఎస్పీవీ మాత్రమే. 2024 ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడం అనేదే ఎస్పీవీ లక్ష్యం. అందుకనే ఎస్పీవీ రూపంలో పవన్ పనిచేస్తున్నారట. మరి ఎస్పీవీ టార్గెట్ రీచవుతుందా ? చూద్దాం ఏమవుతుందో.