అమరావతి : బీజేపీని పవన్ వదిలేసినట్లేనా ?
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రారంభోపన్యాసం వింటే అందరికీ ఇదే అనుమానాలు మొదలవుతాయి. సుమారు రాత్రి 7 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రసంగం ప్రారంభించారు. ఎవరైనా స్పీచ్ అయిపోయిన తర్వాత ధన్యవాదాలు, కృతజ్ఞలు, నమస్కారాలు చెబుతారు. కానీ పవన్ మాత్రం వైరెటీగా ముందే మొదలుపెట్టారు. అన్నీపార్టీలకు, నేతలకు, బహిరంగసభకు స్ధలాలిచ్చిన రైతులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
విచిత్రమేమిటంటే చంద్రబాబునాయుడుతో సహా అన్నీ పార్టీలకు నమస్కారాలు చెప్పిన పవన్ చివరకు వైసీపీ నేతలకు కూడా నమస్కారాలు చెప్పారు. వైసీపీలో బూతులుతిట్టే మంత్రులే కాకుండా మంచి నేతలుకూడా ఉన్నారని చెప్పారు. చివరకు చనిపోయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కూడా నమస్కారాలు చెప్పిన పవన్ తన మిత్రపక్షం బీజేపీని మాత్రం వదిలేశారు. ప్రతి పార్టీని, పార్టీ ముఖ్యనేతలను, పార్టీల్లో బాధ్యులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్ బీజేపీని కమలనాదుల పేర్లు మాత్రం ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇంతమంది నేతల పేర్లు చెప్పిన పవన్ కు తన మిత్రపక్షం నేతల పేర్లకు నమస్కారాలు చెప్పాలని ఎందుకు అనిపించలేదు ? బీజేపీని, బీజేపీ నేతల పేర్లను పవన్ మరచిపోయే అవకావమేలేదు. పవన్ వైఖరి చూస్తే కావాలనే మిత్రపక్షాన్ని, మిత్రపక్షం నేతల పేర్లను వదిలిపెట్టినట్లే అనుమానంగా ఉంది. మరి ఇది దేనికి సంకేతం ? రాబోయే ఎన్నికల్లో నిజంగానే బీజేపీతో పొత్తు కంటిన్యు చేసే ఉద్దేశ్యమే పవన్ కు ఉంటే ఇలా చేయరు. నిజంగా మిత్రపక్షాన్ని ఇప్పటం గ్రామ బహిరంగసభ సందర్భంగా అవమానించటం కాక మరేమిటో పవనే చెప్పాలి.
రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే జనేసైనికులందరు కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్రాన్ని అంధకారం నుండి రక్షించుకోవాలంటే అందరం ఏకతాటిపై కష్టపడాలన్నారు. ప్రశ్నించటం కోసమే తాను పార్టీ పెట్టినట్లు చెప్పుకున్నారు. 2024లో ప్రభుత్వాన్ని స్ధాపించటం ఖాయమని ఆవేశంగా ప్రకటించారు.