పవన్ విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్టేనా..?
ఈనెల 14న తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జరిపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గతంలో సభా ప్రాంగణం విషయంలో పోలీసులు స్థానికుల్ని బెదిరిస్తున్నారని జనసేన ఆరోపించింది. ఆ తర్వాత వేదిక ఖరారై అక్కడ ఏర్పాట్లు మొదలయ్యాయక అసలు సభకే అనుమతి లేదంటున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. సభకు అనుమతివ్వకుండా వ్యవహారాన్ని మరింత క్లిష్టం చేయడం కంటే.. అనుమతిచ్చేయడం మేలని అధికారులు భావించారు. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. పార్టీ ఆవిర్భావ సభా వేదికకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. సంజీవయ్య చైతన్య వేదికగా సభా ప్రాంగణానికి నాయకులు నామకరణం చేశారు.
భారీగా జన సమీకరణ..
పవన్ కల్యాణ్ సభలు, ర్యాలీలంటే ఇసుకేస్తే రాలనంత జనం వస్తారనే విషయం తెలిసిందే. అందులోనూ తొలిసారిగా పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి భారీగా జనసైనికులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ సభా వేదికపై జనసేనాని కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే అది టీడీపీతో పొత్తు విషయంపై ఉంటుందా.. లేక మరేదైనా కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి.