ఆ వార్ మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందా..?

NAGARJUNA NAKKA
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైనికులు వారి ఆయుధాలను వదిలేసి.. ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటానియో గుటెరస్ అప్రమత్తమయ్యారు. శాంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అత్యవసరంగా భేటీ అయింది.

ఇక రష్యా యుద్ధం ప్రకటించడంతో తమ దేశ పౌరులను ఉక్రెయిన్ అప్రమత్తం చేసింది. ఆ దేశ రాజధాని కీవ్ లో ఈ తెల్లవారు జాము నుంచి ఎయిర్ సైరన్లు నిరంతరాయంగా మోగుతున్నాయి. నగరంపైకి క్షిపణులు దూసుకొచ్చే సంకేతాలు ఇస్తూ ఈ సైరన్లు మోగుతుండగా.. వీటిని విన్న వెంటనే ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు సహా ఇతర సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య డబ్ల్యూడబ్ల్యూ-3కి దారితీస్తుందా..?  అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. ఉక్రెయిన్ కు అండగా ఉంటామన్నారు. అటు ఫ్రాన్స్, బ్రిటన్ సైతం ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించాయి. ఈ దేశాలు ఏకమై రష్యాపై ప్రతిదాడికి దిగితే ఇది కాస్తా ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని విశ్లేషకుల అంచనా. అయితే పరిస్థితులు అంతవరకు రాకపోవచ్చని వారు అంటున్నారు.

ఇక ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా శుక్రవారం జీ7దేశాల అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. అమెరికాతో పాటు, కెనడా, ఈయూ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమిలో చాలా దేశాలు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాయి. మరి శుక్రవారం భేటీలో ఈ కూటమి ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూద్దాం.. ఈ పరిణామాలు ఎంత వరకు దారితీస్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: