భీమ్లాపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు.. నిజమేనా..?

Deekshitha Reddy
భీమ్లా నాయక్ సినిమా విడుదలవుతున్న సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావిడి నెలకొంది. పవన్ కల్యాణ్ సినిమా అంటే.. అందరికీ ఆసక్తి ఉంటుంది, అందులోనూ పొలిటికల్ హీట్ పెరిగిన ఈ టైమ్ లో సినిమాపై మరింత ఆసక్తి ఉంది. వకీల్ సాబ్ కరోనా దెబ్బకి కాస్త ఇబ్బంది పడ్డా.. భీమ్లా కరోనా టైమ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రికార్డులు బ్రేక్ అవుతాయని ఆశిస్తున్నారు అభిమానులంతా. కానీ ఏపీలో ఇంటా సినిమా టికెట్ల వ్యవహారం తెగలేదు. అటు బెనిఫిట్ షో లు కూడా వద్దంటూ ప్రభుత్వం గతంలోనే ఆర్డర్లు ఇచ్చింది.

వాస్తవానికి కరోనా తర్వాత ప్రభుత్వ నిర్ణయం మారుతుందని ఆశించారంతా. చిరంజీవి టీమ్ కూడా సీఎం జగన్ తో చర్చలు జరిపి అంతా బాగుంటుందని, త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు. కానీ అలాంటివేవీ జరగలేదు. కేవలం సెకండ్ షో కి మాత్రమే పరిమితం ఇచ్చారు. అది కూడా నైట్ కర్ఫ్యూ తీసివేయడం వల్ల. ఇక ఇప్పుడు తాజాగా భీమ్లా నాయక్ విడుదల సందర్భంలో థియేటర్ల వద్ద అధికారుల చెకింగ్ లు మొదలయ్యాయి. బెనిఫిట్ షో లు వేయొద్దు, టికెట్ రేట్లు పెంచొద్దు అంటూ నోటీసులిచ్చారు. దీంతో మరోసారి గొడవ మొదలైంది.

ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ పై కక్షసాధింపు మొదలు పెట్టిందని విమర్శిస్తున్నారు కొంతమంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలోనే బెనిఫిట్ షో లు రద్దు అనే నిబంధన ఉంటే.. మళ్లీ కొత్తగా నోటీసులు, చెకింగ్ లు ఎందుకంటున్నారాయన.




అటు పవన్ అభిమానుల్లో కూడా బెనిఫిట్ షో లు లేవనే నిరాశ ఉంది. పవన్ కల్యాణ్ మాత్రం ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే కచ్చితంగా అది సంచలనంగా మారుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ ఎలాంటి పొలిటికల్ కామెంట్లు చేయకపోవడం విశేషం. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడంతో పవన్, పొలిటికల్ వ్యవహారాలపై కాస్త దూరంగానే ఉన్నారు. కేవలం సినిమా ఫంక్షన్ గానే దాన్ని ముగించారు. ఏపీ ప్రస్తావన, ఏపీలో టికెట్ రేట్లు, బెనిఫిట్ షో ల ప్రస్తావన తేలేదు. కానీ ఏపీలో అధికారుల తనిఖీలపై మాత్రం అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: