అమరావతి : టీడీపీ ముందు గురివింద గింజ కూడా పనికిరాదా ?
తెలుగుదేశంపార్టీ ముందు గురివింద గింజ కూడా పనికిరాదు. తనలో లోపాలను పెట్టుకుని ఎదుటి వాళ్ళ లోపాలను లేదా తనలో తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపేవాళ్ళను గురువింద గింజతో పోల్చటం అందరికీ తెలిసిందే. అందుకనే ‘గురివింద గింజ తన నలుపు ఎరుగదు’ అనే సామెత వచ్చింది. ఇపుడీ గురివిందగింజ సామెత ఎందుకంటే రెండు రోజులుగా వరసగా నారా లోకేష్ చేస్తున్న ట్వీట్లే కారణం.
ఇంతకీ విషయం ఏమిటంటే దుబాయ్ లో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించటమే లక్షంగా సదస్సు జరుగుతోంది. దానికి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, ఏపీకి ఆహ్వానించటమే టార్గెట్ గా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్ ఏర్పాటు చేసినంత మాత్రాన లేదా మంత్రి హాజరై స్పీచులిచ్చినంత మాత్రాన పెట్టుబడులు వచ్చేయవు. సదస్సులో పార్టిసిపేట్ చేయటం దేనికంటే ఏపీ అనే రాష్ట్రం ఒకటుందని, అందులో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియాలన్నదే లక్ష్యం.
ఇందులో భాగంగానే మంత్రి ఒక ఆడిటోరియంలో మాట్లాడారు. అందులో కొందరు ఆహ్వానితులు హాజరవ్వగా మిగిలిన కుర్చీలంతా ఖాళీగానే ఉంది. దీన్ని పట్టుకుని లోకేష్ విపరీతంగా ఎగతాళి చేస్తున్నారు. మీడియాలోను ట్విట్టర్లోను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడే లోకేష్ విషయంలో గురివింద గింజ సామెత గుర్తుకొస్తోంది. చంద్రబాబునాయుడు+లోకేష్ వరసగా దావోస్ లో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు 5 ఏళ్ళు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళద్దరికీ ఆహ్వానపత్రికలు రాకపోతే ప్రతిసారి సుమారు రు. 4 కోట్లు పెట్టి ఆహ్వానపత్రికను కొనుక్కుని మరీ దావోస్ కు వెళ్ళారు. మరన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆహ్వానపత్రికలు కొనుక్కుని వెళ్ళిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు ?
దావోస్ విషయం వదిలేస్తే చంద్రబాబు కోట్ల రూపాయలు వ్యయంచేసి వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు నాలుగేళ్ళు నిర్వహించారు. ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి ? సదస్సు ముగిసిన వెంటనే రు. 14 లక్షల కోట్లని కాదు కాదు రు. 16 లక్షల కోట్లకు ఎంవోయులు అయ్యాయని ప్రకటించేవారు. చంద్రబాబు ప్రకటనలే నిజమైతే ఏపీకి చంద్రబాబు హయాంలోనే రు. 60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చుండాలి. కానీ చివరకు వచ్చింది గుండుసున్నా. చంద్రబాబు ప్రకటనలు చూసే కేంద్రప్రభుత్వం కూడా ఏపీకి ఇక ప్రత్యేకహోదా ఎందుకు అవసరం లేదని చెప్పేసింది.
నాలుగేళ్ళ పాటు వరసగా సదస్సులు నిర్వహించటం వల్ల జరిగిందేమంటే ఏపీ ఖజానాకు రు. 120 కోట్లు బొక్క. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు పరిశ్రమల శాఖ అధికారికంగా ఇచ్చిన సమాధానం. అప్పుడు అడిగింది కూడా ఎవరో కాదు జనసేనలో ఇపుడు కీలక నేత నాదెండ్ల మనోహర్. కాబట్టి ఒకసారి తమ హయాంలో ఏమి జరిగిందో లోకేష్ గుర్తు చేసుకుంటే బాగుంటుంది. దుబాయ్ నుండి మంత్రి వచ్చి ఒక ప్రకటన చేసేంతవరకు ఓపిక పట్టాలన్న ఆలోచన లోకేష్ కు లేకపోవటం వల్ల గురివింద గింజ సామెత గుర్తుకొస్తోంది.