కేటీఆర్: సామాన్యుల సొంత ఇంటి కల నెరవేరుస్తున్నాం...

VAMSI
పాలిటిక్స్ లో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా మరింత అలర్ట్ గా ఉంటారు. ఓ వైపు తాము చేస్తున్న అభివృద్ధి  కార్యక్రమాల గురించి చెప్తూనే అదే సమయంలో తమని విమర్శించిన వారికి స్వీట్ కామెంట్స్ కూడా బాగానే దట్టిస్తారు. ఇపుడు తాజాగా ఇలాంటి సందర్భం మరొకటి వచ్చింది. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తపాబాద్ మండలంలో ఫిబ్రవరి 14 సోమవారం నాడు రాష్ట్ర ఐటి , పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు డబుల్ బెడ్ రూం ఇళ్లను తన చేతుల మీదుగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ విధంగా అన్నారు.

ఇల్లు అనేది ప్రతి సామాన్యుడి మొదటి కల. నేడు ఆ కలకు ప్రాణం పోసి , ఆయువు పెంచే కార్యక్రమం మొదలయ్యింది. అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. అన్ని వసతులతో కూడిన ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టడం జరిగింది. వీలైనంత త్వరలోనే పూర్తిచేసి పేదలకు అందిస్తాము. ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల యొక్క నిర్మాణం దేశానికి ఆదర్శంగా నిలిచి ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఈ ఇళ్లను అందుకున్న ప్రజలు సంతోషంతో పొంగిపోయేలా ఇళ్ల నిర్మాణం ఉండాలని తెలంగాణ సీఎం కెసిఆర్ ఆకాంక్ష. నిర్మాణం కూడా అంతే వేడుకగా జరుగుతుంది. రాష్ట్రంలోనే 18 వేల కోట్లతో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టాము.

ఇక్కడ అందరూ ఆనందపడే మరో విషయం ఏమిటంటే ఇళ్ల నిర్మాణం కోసం కానీ, అందించడం కోసం ఎవరి వద్ద నుండి రూపాయి కూడా తీసుకుపోయేది లేదు. పైసా ఖర్చు కూడా ఎవరు చెల్లించవలసిన పనిలేదు, త్వరలోనే అందరికీ ఇల్లు అందేలా పూర్తి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఇళ్లను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలకు కూడా 8,500 కోట్ల రూపాయల వరకు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికొస్తే ఏమీ తోచక ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతూ ఉంటారే తప్పా.... తెలంగాణ అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది అని మరోసారి చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం పై రాళ్ళు విసరాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాల్లో అయినా అమలులో ఉన్నాయా అన్నది దమ్ముంటే చూపించాలని ఢీ అంటే ఢీ అంటూ విమర్శలు విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: