డైలమాలో జగన్.. సినిమా టికెట్ రేట్లు పెంచితే ఉద్యోగులు ఊరుకుంటారా..?

Deekshitha Reddy
ఏపీ సీఎం జగన్ కు ఈరోజు పెద్ద అగ్నిపరీక్ష ఎదురవుతోంది. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని, బెనిఫిట్ షో ల విషయంలో ఉదారంగా ఉండాలంటూ సినిమా పెద్దలు సీఎం జగన్ ని కలవబోతున్నారు. గతంలో కూడా ఇలాంటి చర్చలు జరిగినా ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ల తగ్గింపుకే మొగ్గు చూపింది. దాని ప్రకారం జీవో ఇచ్చింది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పుడు మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

జగన్ ఏ గట్టునుంటారు..?
ఉదారంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుతామంటూ జగన్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేస్తే సినిమావాళ్లు సంతోషపడేవారు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి కాస్త సందిగ్ధంగా ఉంది. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ పెంపుకోసం ఉద్యమం చేశారు. వారు అడిగిన ఫిట్ మెంట్ కి ప్రభుత్వం అంగీకరించలేదు. అయినా కూడా మరికొన్ని వెసులుబాట్లు ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు వెళ్లకుండానే వెనక్కు తగ్గామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. వీరితో ఇప్పుడు టీచర్లు విభేదిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని టీచర్ల తరపున మళ్లీ పోరాటం చేస్తామంటున్నారు. టీచర్లు ఎంతవరకు పోరాటం చేస్తారు, ఏమేం సాధిస్తారనేది ముందు ముందు తేలుతుంది.

ఇప్పుడు జగన్ సమస్య ఏంటంటే.. ఉద్యోగులకు జీతాలు పెంచకుండా.. టికెట్ రేట్లు పెంచగలరా..? ఉద్యోగులు అడిగిన పీఆర్సీ విషయంలో ముందడుగు వేయని జగన్, సినిమావాళ్ల కష్టాలు మాత్రం తీర్చేయడానికి ముందుకొస్తారా..? పోనీ టికెట్ రేట్లు పెచండం, తగ్గించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభనష్టాలేవీ లేవు కాబట్టి.. సినిమావాళ్ల బాధలు తీర్చడం వల్ల ఖజానాపై భారం పడదు కాబట్టి జగన్ అలాంటి నిర్ణయం తీసుకున్నారనుకుందాం. కానీ అదే సమయంలో ఉద్యోగుల బాధలు కూడా అంతే ఆసక్తిగా జగన్ వినాలి కదా..? ఇప్పటికే ఓసారి టీచర్లు రోడ్డెక్కడం సరికాదని జగన్ కుండబద్దలు కొట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని కూడా ప్రశ్నించారు. ఈ దశలో సినిమా టికెట్ రేట్లు పెంచి, గతంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు..? టికెట్ రేట్లు తగ్గించి పేదలకు పెద్ద మేలు చేశామని చెప్పుకున్న ప్రభుత్వం, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే దాన్ని ఎలా కవర్ చేసుకోగలదు. ఇదే ఇప్పుడు అసలు సమస్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: