కృష్ణ కృష్ణా: హమ్మయ్య టీడీపీ నోరు విప్పింది? ఇంకేం చేయండ్రా రగడ!
జిల్లాల పునర్విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు నోరువిప్పారు.తన నిరసన గళం వినిపించారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏపీ సీఎంఓ నుంచి ప్రకటన వచ్చాక ఇంతవరకూ టీడీపీ నుంచి పూర్తిస్థాయిలో ఎటువంటి సమాచారంలేదు. అంటే టీడీపీ నాయకులు ఈ పునర్విభజనను అంగీకరిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అన్న దానిపై అస్సలు కొంచమంటే కొంచమయినా స్పష్టత లేదు.ఎట్టకేలకు నిన్నటి వేళ చంద్రబాబు స్పందించి ఎన్టీఆర్ ను ఎవ్వరు గౌరవించినా తాము స్వాగతిస్తామని ఆ విధంగా విజయవాడ లోక్ సభను జిల్లాగా పరిగణించి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అన్న పేరును ఆ ప్రాంతానికి ఖాయం చేయడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అన్నారు.
ఇదే సమయంలో ఆయన మరికొన్ని ఆసక్తిదాయక విషయాలు చెప్పారు.ఆ రోజు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను తొలగించి ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారని, పేదలకు పట్టెడన్నెం పెట్టే క్యాంటీన్లను వద్దనుకుని, ఇప్పుడు మాత్రం ఈ విధంగా ప్రేమ ప్రకటించడం అంత సబబుగా లేదన్న వాదన ఒకటి టీడీపీ బలీయంగా వినిపిస్తోంది. అదేవిధంగారాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకు ప్రతిరోజూ అవమానం జరుగుతుంటే కనీసం అడ్డుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
ఇదేసందర్భంలో మరో విషయం కూడా చెప్పారు.. తాము అమరావతి కేంద్రంగా చేపట్టిన ఎన్టీఆర్ స్మృతి వనం పనులు అర్ధంతరంగా నిలిపివేశారని, ఇవన్నీ చేసినప్పుడే ఎన్టీఆర్ పేరు పెట్టినా అందుకు ఓ సార్థకత ఉంటుందని చంద్రబాబు తన అభిప్రాయాన్ని ఎటువంటి సందేహాలకూ తావివ్వకుండా చెప్పారు. మరోవైపు ఎన్టీఆర్ పేరు కొత్తగా ఏర్పాటు కానున్న కృష్ణా జిల్లాకు పెట్టడంపై కొడాలి నాని ఆహ్వానించారు.సీఎం కు పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.