అమరావతి : ఉద్యోగనేతల అసలు రంగు బయటపడుతుందా ?
పీఆర్సీ వివాదం ఎప్పుడు తేలుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఎందుకంటే జీతాలు పెరుగుదల, తగ్గుదల అనే అంశంపై ఇటు ప్రభుత్వం అటు ఉద్యోగసంఘాలు ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడున్నారు. ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడున్నపుడు ఇక సమస్య ఎలా పరిష్కారమవుతుంది ? సమస్య పరిష్కారం కాదుసరే మరి ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మాటేమిటి ? నాలుగు రోజుల్లో ఈ సందేహానికి తెరపడబోతోంది.
సరిగ్గా ఈ పాయింట్ మీదే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. అదేమిటంటే ఉద్యోగులకు జీతాలను వదిలిపెట్టేసి రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ను మాత్రం యధావిధిగా అందించాలని డిసైడ్ అయ్యిందట. జీతమైనా, పెన్షన్ అయినా ప్రతినెల మొదటి రెండు తేదీల్లో బ్యాంకు ఖాతాల్లో పడిపోతుంది. ఆందోళన, సమ్మె కారణంగా ఉద్యోగులకైనా, పెన్షనర్లకైనా జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయటం ట్రెజరీల ద్వారా కష్టమవుతుందని అందరికీ తెలిసిందే.
బిల్లులు ప్రాసెస్ కానిదే జీతాలు, పెన్షన్లు పడవు. అందుకనే ఇప్పటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని ముందు పెన్షన్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులేమో కొత్త పీఆర్సీ ప్రకారం కాకుండా పాత జీతాలే వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయటం సాధ్యంకాదు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెడుతున్నా బిల్లులు ప్రాసెస్ చేయాల్సింది కూడా ఉద్యోగులే. మరి వీళ్ళు కూడా సమ్మెలో ఉన్నపుడు బిల్లుల ప్రాసెస్ సాధ్యంకాదు.
అందుకనే ట్రెజరీ ఉద్యోగులతో సంబంధం లేకుండా ఆర్ధికశాఖ అధికారులే పెన్షన్లు మాత్రం ప్రాసెస్ చేసేస్తారట. దీనికి గతంలో ఏర్పాటుచేసిన కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్) అనే వ్యవస్ధ ఉంది. దాని ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగులకిచ్చే పెన్షన్లను ట్రెజరీలతో సంబంధం లేకుండా ఆర్ధికశాఖే పెన్షన్లు వేసేయచ్చు. ఇపుడా పద్దతిలోనే పెన్షన్లు వేయటానికి ఆర్ధికశాఖ రెడీ అవుతోందని సమాచారం. ఈ పద్దతిలో పెన్షన్లు పడిపోతే పాత పీఆర్సీ జీతానికి, కొత్త పీఆర్సీ జీతానికి మధ్య తేడా ఏమిటో తెలిసిపోతుంది.