యూపీ ఎన్నికల్లో ప్రచారానికి విదేశీ సింగర్లు...!

Podili Ravindranath
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. యూపీలో పాగా వేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. యూపీలో అధికారంలో ఉన్న పార్టీనే జాతీయ స్థాయిలో కింగ్ మేకర్‌గా ఉంటుందనేది నేతల భావన. దీంతో యూపీలో  అధికారం కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి కూడా. అలాగే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు నేతలు. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇదే తరహాలో ఇతర పార్టీల నేతలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.
ఓటర్ల కోసం రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. ప్రత్యేక పాటలు రూపొందించారు. ఇక మరికొందరు అయితే... తమ పేరుతో ప్రత్యేక శ్లోకాలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన ఓ నేత ఏకంగా శ్రీలంక సింగర్ యోహానీతో ప్రత్యేక పాటలు పాడించారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చైల్డ్ ఆర్టిస్ సహదేవ్ డిర్డో కూడా ప్రస్తుతం యూపీ ఎన్నికల ప్రచారంలో ఓ నేత తరఫున ప్రచారం చేస్తున్నారు. హిట్ పాటలకు పేరడీలు కట్టి మరీ కమలం పార్టీ నేతలు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ర్యాలీలు, బహిరంగ సభలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దీంతో నేతలంతా కూడా కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లు అయిన వాట్సప్, టెలిగ్రామ్ నంబర్లతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. వాటికి తమ తమ ప్రచారానికి చెందిన పోస్టర్లు, ఫోటోలు, పాటలు, వీడియోలను పంపుతున్నారు. అలాగే ప్రతి రోజు యూట్యూబ్ ద్వారా లైవ్ నిర్వహించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: