సంక్షేమ భారం ఇంకెన్నాళ్లురా మోయాలి...?
ఆ రుణం,ఈ రుణం కలిపి దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయిలు అని తేలింది.ఐదేళ్లకు (టీడీపీ పాలనకు సంబంధించి) మూడు ల క్షల కోట్లు కాగా, రెండున్నరేళ్లకు(వైసీపీ పాలనకు) రెండున్నర లక్షల కోట్లు..ఇంకా కొన్ని అప్పులున్నాయి.అవి కూడా లెక్కలోకి తీ సుకోవాలి.ఏదేమయినప్పటికీ సంక్షేమ భారం రానున్న కాలంలో ప్రతి ఆంధ్రుడూ మోయాలి..ఆంధ్రుడే కాదు ఇటుగా వచ్చే ఏ పక్క రాష్ట్రం వారయినా ఇక్కడ అమలయ్యే పన్ను వాతలకు కుయ్యో మొర్రో అని అనాల్సిందే రేపటి వేళ!
అంతగా అప్పులు చేసి సంక్షేమం చేస్తున్న ప్రియ పాలక నేస్తం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం వెలువరించారు. ఉద్యోగుల పెన్షన్లు, భవిష్య నిధి ఖాతాల చెల్లింపు ఇంకా మిగిలిన అంశాలను కలుపుకుని ఆర్థికంగా ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు కనుక సులువుగా పదవీ విరమణ కాలం పెంచారు.అరవై నుంచి అరవై రెండుకు పెంచి పదవీ విరమణ వయస్సును ఖరారు చేసి సంబంధిత వర్గాల్లో ఆనందం నింపారు.
అస్సలే ఉద్యోగాలు సరిగా చేయరన్న వాదన కారణంగా ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అన్నింటా కూడా విమర్శలు వస్తున్నాయి.అంతేకాదు నిరుద్యోగ భారతంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు పెరిగిపోతున్నా యే తప్ప రెగ్యులర్ పోస్టులకు ఆస్కారమే లేదు.ఇప్పుడీ ముసలీ ముతకా బ్యాచ్ తో జగనన్న రానున్న రెండున్నరేళ్లు పాలన సాగిస్తారని ఖరారైందని తేలిపోయింది. ఆ రోజు చంద్రబాబు పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 చేశారు.ఇప్పుడీయన ఆ వయస్సు ను కాస్త పెంచి మరో వివాదానికి తెరలేపారు. అంటే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు తావేలేదని తేల్చేశారు.
ఈ నేపథ్యంలో చదువుకున్న యువత ఏం కావాలి? ప్రభుత్వ రంగం కాకుండా ప్రయివేటు రంగం శరణ్యం అనుకుని బతకాలి.పోనీ అక్కడ యినా ఉద్యోగ భద్రత ఉందా అంటే అదీ లేదు.సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం అమలే కావడం లేదు. ఈ దశలో కోర్టులకు పోయినా న్యాయం దక్కని స్థితిలో సంబంధిత ప్రయివేటు ఉద్యోగ వర్గాలు ఉన్నాయి. ఈ దశలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ గడువు పెంచి ఏం సాధిస్తారని?