ఏపి అప్రమత్తం... కారణం ఇదే
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరిహద్దులను అప్రమత్తం చేసింది. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా, అధికార యంత్రాగంలోని వివిధ శాఖలు సమన్వయంతో తమిళనాడు- ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తమిళనాడు నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ, అందలోని ప్రయాణీకుల సమాచారం వాకబు చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి తమిళనాడులో ఎక్కువ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోవిడ్-19 మొదటి, రెండవ వేవ్ లలో సరిహద్దు జిల్లా నెల్లూరులో కేసులు పెరగడానికి తమిళనాడు కారణం కావడంతో ప్రస్తుతం అధికారులు మందస్తు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై వచ్చే వాహనాలతో పాటు, చెన్నై- సూళ్లూరు పేట మధ్య నడుస్తున్న మెమో రైళ్ల లో ప్రయాణించే ప్రయాణీకులకు సైతం థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. తమిళనాడు కార్పోరేషన్ లోని నలభై వేల వీధుల్లో ఇప్పటికే ఐదువందల పైచిలుకు వీధుల్లో కరోనా మహమ్మారి వ్యాపించినట్లు అధికారిక సమాచారం. దీంతో ఆ రాష్ట్రం క్రమంగా కంటోన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. ఒకే వీధిలో ముగ్గురు కన్నా ఎక్కువ మంది కరోనా వ్యాధిగ్రస్తులుంటే ఆ వీధిని కంటోన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తోంది అక్కడి ప్రభుత్వ యంత్రాగం. అయితే తమిళనాడులో ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ఆంక్షలు విధించ లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా ప్రజలు భయాందోళనకు గురికావల్సిన అవసంర లేదని, కోవిడ్-19 ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ఇప్పటికే ప్రకటించారు. మరో వారంలో ప్రస్తుతం ఉన్న పడకలతో పాటు మరో ఎనిమి వందల పడకలు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడులో ఏం జరిగినా, దాని ప్రభావం సరిహద్దులోని నెల్లూరు జిల్లా పై పడుతుంది. చెన్నై నగరానికి కూత వేటు దూరంలో నెల్లూరు జిల్లా సరిహద్దులుండటంతో ఆంధ్ర ప్రదేశ్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వచ్చందంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.