అమరావతి : వచ్చే ఎన్నికల్లో గెలుపుకు జగన్ మాస్టర్ ప్లాన్
రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవటానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ ప్రకారం వెళుతున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ఇపుడేసింది కాదు. 2019 అధికారంలోకి రాగానే ప్లాన్ వేయటం, మొదలుపెట్టేయటం కూడా అయిపోయింది. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటంటే వాళ్ళతో వీళ్ళతో కాకుండా డైరెక్టుగా జనాలతోనే పొత్తు పెట్టేసుకోవటం. ప్రజలకు అత్యవసరమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా వాళ్ళతోనే నేరుగా కాంటాక్టులో ఉండాలనేది జగన్ ప్లాన్.
వచ్చే ఎన్నికల నాటికి తన ప్రభుత్వం మీద జనాల్లో ఎంతోకొంత అసంతృప్తో లేకపోతే వ్యతిరేకతో ఉంటుందని జగన్ కు బాగానే తెలుసు. ఇదే సమయంలో కొందరు ఎంఎల్ఏలను మార్చాల్సొస్తుందని కూడా తెలుసు. అందుకనే ఎంఎల్ఏలను కంటిన్యు చేసినా లేకపోతే మార్చినా ఎలాంటి సమస్యలు లేకుండా తనను చూసే ప్రజలు ఓట్లేసేట్లుగా వాళ్ళను ట్యూన్ చేసుకుంటున్నారు. తప్పనిసరిగా మార్చాల్సిన ఎంఎల్ఏలను ఎలాగూ మార్చేస్తారు.
అయితే ఎంఎల్ఏలపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వం మీద పడకుండానే జగన్ జాగ్రత్త పడుతున్నారు. అందుకనే ఎంఎల్ఏలను చూసి కాకుండా తనను చూసే ఓట్లేసేట్లుగా జనాలను కన్వీన్స్ చేస్తున్నారు. అందుకనే గతంలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దీనివల్ల అభివృద్ది తగ్గుతున్న మాట వాస్తవమే. అందుకనే రెండున్నరేళ్ళ తర్వాత అభివృద్ధి విషయంలో జగన్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే కొన్ని జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు ఏమి చేశారో అందరు చూసిందే. అధికారంలోకి వచ్చేముందు ఒకలాగ వచ్చిన తర్వాత మరోలాగ వ్యవహరించారు. దాంతోనే చంద్రబాబుపై జనాలకు మండిపోయిం. ఈ విషయాన్ని గమనించిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చేశారు. ఇక్కడే చంద్రబాబుకు సమస్యొచ్చిపడింది.