సంక్రాంతికి స్పెషల్ బస్, ట్రైన్ సర్వీసులు.. కానీ..!

NAGARJUNA NAKKA
సంక్రాంతికి సొంతూరుకు వెళ్లాలనుకునే వారికి కష్టాలు తప్పేలా లేవు. జనవరి 7 నుంచి 14వరకు రైళ్లు బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉండగా.. రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ దాటి రిగ్రెట్ అని వస్తోంది. అటు హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో బెర్తులు, సీట్లు ఖాళీగా ఉండగా.. స్పెషల్ రైళ్లు వేస్తారేమోనని ప్రయాణీకులు ఎదురు చూస్తున్నారు.

ఇక విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రోజు ఇప్పటికే ప్రారంభం కాగా.. 25, 30. 31తేదీల్లో బెజవాడలో రాత్రి 9గంటల 20నిమిషాలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పలాస చేరుతుంది. అలాగే పలాసలో మధ్యాహ్నం 1.30గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 3గంటలకు బెజవాడ చేరుతుంది. ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనకాపల్లి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. జనవరి 1నుంచి నడిచే ఈ రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మచిలీపట్నం-కర్నూలు, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, మచిలీపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రైళ్లు నడుస్తాయని వివరించింది.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 1,266 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ శ్రీకాకుళం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. జనవరి 7నుంచి 17వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. వీటిలో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ సైట్ లో ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. చూద్దాం.. మరి ప్రయాణీకుల సంక్రాంతి టూర్ ఏవిధంగా సాగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: