పెళ్లి వద్దు కానీ.. సహజీవనం చేసుకోవచ్చు : హైకోర్టు
అయితే ఇటీవలి కాలంలో ఆడపిల్లలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండగా చట్టంలో మార్పులు చేస్తూ ఇక ఆడ పిల్లల పెళ్ళి వయస్సు 21 సంవత్సరాలు గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెళ్లి కారణంగా ఆడ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదు అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే పంజాబ్ హర్యానా హైకోర్టు ఓ ప్రేమజంట విషయంలో వెలువరించిన తీర్పు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. పంజాబ్లోని గురుదాస్ పూర్ కు చెందిన ఓ ప్రేమజంట భద్రత కల్పించాలి అంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఆశ్రయించింది.
అయితే వీరిద్దరికీ 18 ఏళ్లు నిండడం గమనార్హం. ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ ఇద్దరు యువతీ యువకులు సహజీవనం చేస్తున్నారు. అయితే యువతికి 18 ఏళ్లు నిండగా.. యువకుడికి మాత్రం 21 ఏళ్లు నిండక పోవడంతో ఇక వివాహం చేసుకోవడానికి అనుమతి లేకుండా పోయింది. అయితే తమ కుటుంబీకుల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని రక్షణ కల్పించాలంటూ ప్రేమజంట కోర్టును ఆశ్రయించింది. ఇక వీరి కేసును విచారించిన హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అబ్బాయికి 21 ఏళ్లు నిండలేదు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని కానీ సహజీవనం మాత్రం చేసుకోవచ్చు అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక పోలీసులు ఈ ప్రేమ జంట కు భద్రత కల్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.