Jagan @ 49 : పోలీసు జీపులో వాసన్న రౌడీలు భలే!
నిన్నటి వేళ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనుషులు ఓ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధిని ఇష్టం వచ్చిన విధంగా కొట్టారు. చేతులు జోడించి వేడుకున్నా సుభానీ అన్న మంత్రి మనిషి అస్సలు ఆయనను వదిలిపెట్టలేదు. అస్సలు ఆ ఆలోచన ఎలా వస్తుంది. ఎలా ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా కొడ్తారు. మంత్రి ఏమో ఇవేవీ నాకు తెలియదు అని అంటారు. ఆయనకు తెలియకుండానే కథ నడుస్తుందా?
సుభానీ ఎవరు మంత్రి అనుచరుడు. సుబ్బారావు గుప్తా ఎవరు? ఆయన వైఎస్సార్ పార్టీ అభిమాని. ఓ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి. మరి! న్యాయం చేయాల్సింది ఎవరు? బూతులు మాట్లాడుతున్న మంత్రుల కారణంగా పార్టీ పరువు పోతుంది అని చెప్పిన పాపానికి ఇష్టం వచ్చిన రీతిన కొడతారా... పోలీసు జీపులో వెళ్లి మరీ తన్ని వస్తారా..ఇదేనా ప్రజా స్వామ్య దేశం.. ఇదే ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన రీతి. అంటే వాసన్న మనుషులకు ఒంగోలు నుంచి గుంటూరుకు వచ్చే స్వేచ్ఛ ఉంది. లాడ్జీలో ప్రాణ రక్షణార్థం ఉంటే దాక్కున్న వ్యక్తిని లాగి లాగి కొట్టే స్వేచ్ఛ మరియు అవకాశం కూడా ఉంది. కానీ మీరు బూతులు మాట్లాడవద్దు అని స్వేచ్ఛాయుత ధోరణిలో చెప్పే హక్కు పాపం ఆ అమాయక వ్యాపారికి లేదు. ఇది రా రాజ్యం. రాజన్న రాజ్యం
అంటే ఇలానే ఉండాలి. ఇంతకుమించి కూడా ఉండాలి. ఏం కాదు అన్నింటినీ భరించడం మన బాధ్యత. వద్దంటే తంతారు.. వద్దంటే కాల్మొక్కుతా అనేలా తంతారు. ఏదయినా వాసన్న గ్రేట్ రా.
- రత్నకిశోర్ శంభుమహంతి