నగరిలో గెలిచినా అసెంబ్లీలో జగనన్నకు మద్దతుగా నాలుగు సినిమా డైలాగులు చెప్పినా ఇవన్నీ రోజా జీవితాన్ని మార్చలేకపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆమెను ఎలా అయినా సైడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నవారంతా ఇప్పుడొక స్కెచ్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎలానూ పార్టీ అధినేత దీవెనలున్నాయి కనుక ఆమె తాను అనుకున్న విధంగా మంత్రి పదవి తెచ్చుకున్నా జిల్లా రాజకీయాల్లో మాత్రం పెద్దిరెడ్డి మాటే నెగ్గేలా చేసేందుకు ప్రణాళిక ఒకటి సిద్ధమైంది అని తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకున్నా రోజాకు జిల్లా లో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా చేసి నగరిలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని బలపరిచైనా సరే
తమ పంతం నెగ్గించుకోవాలి చూస్తున్నారు.
రాజకీయాల్లో తనకంటూ ఓ మార్కు తెచ్చుకున్న రోజా సెల్వమణి (నగరి ఎమ్మెల్యే) ఇంట గెలిచినా రచ్చను మాత్రం నిలువరించలే క నానా అవస్థలూ పడుతున్నారు. ప్రత్యర్థులను నిలువరించలేక సతమతం అవుతున్నారు. అయినా కూడా తనకు రానున్న కొత్త క్యాబినెట్ లో చోటు ఖాయమనే చెబుతున్నారు. ఇందుకోసం తనకు స్పష్టమయిన హామీ కూడా అధినేత జగన్ ఇచ్చారని రోజా తన వర్గం వద్ద చెబుతున్న మాట. ఈ మాట ఎలా ఉన్నా రోజాను పార్టీ నుంచే పంపెయ్యాలన్నది ఓ ప్లాన్. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి వర్గం, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్గం పన్నాగాలు పన్నుతున్నారని తెలుస్తోంది.
ఒకవేళ రోజా ను పార్టీ నుంచి పంపలేకపోయినా కనీసం తనకు టికెట్ కూడా దక్కనివ్వకుండా చేస్తే కొంతలో కొంత తమ వర్గం విజయం సాధించినట్లేనని వీరంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో రోజాకు వ్యతిరేకంగా నగరిలో రాజకీయం నడిపేందుకు పెద్దిరెడ్డి మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు మండల స్థాయి నాయకులు సిద్ధం అయ్యారని కూడా సమాచారం. దీంతో సహా డిప్యూటీ సీఎం కూడా వీరికి ఓ మాట సాయం చేసి ఉన్నారని కూడా తెలుస్తోంది.