ఎమ్మెల్సీ కౌంటింగ్ : కేసీఆర్ కు చుక్కలే చుక్కలు? ఈటెల ఉన్నాడుగా!
ఆయనకు చుక్కలు చూపించేందుకు మళ్లీ మళ్లీ
ఆరాటపడుతున్నారు. ఆ విధంగా ఈ స్థానిక పోరు
ఓ విధంగా రసకందాయమే! ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నవి
మళ్లీ మళ్లీ ఈటెల బల నిరూపణకు సంకేతమే!
కొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదలు కానుంది. స్థానిక సంస్థల నియోజకవర్గ కోటా నుంచి ఈ నెల 10న జరిగిన ఎన్నికలకు అమిత ప్రాధాన్యం నెలకొంది. కేసీఆర్ ఈ ఎన్నికలను కూడా ఎప్పటిలానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గులాబీ దండు క్యాంపు రాజకీయాలు నడిపారన్న వాదన ఒకటి బలీయంగా వినిపించి నిరూపితం అయింది. దీంతో కరీంనగర్ లో రెండు నియోజకవర్గాల తో పాటు ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఒక్కో నియోజకవర్గానికి జరిగిన ఈ ఎన్నిక ఉత్కంఠగానే ఉంది. ముఖ్యంగా కరీంనగర్ లో తన పట్టు నిరూపించుకునేందుకు బరిలో ఈటెల తరఫు మనిషి రవీందర్ సింగ్ ఉన్నారు. ఆయన గెలుపుపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. గులాబీ దండు ఎలా అయినా పై చేయి సాధించాలన్న పట్టుదలతో ఉంది.
ఈటెల పట్టు నిలుపుకుంటారా?
ఈ సారి కూడా ఆయనదే పైచేయి కానుందా?
తదితర ప్రశ్నలు కూడా తెలంగాణ వాకిట రేగుతున్నాయి. వాస్తవానికి అధికార పార్టీగా బాగా బలంగా ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గాలు ఎందుకనో ఈ సారి కాస్త పట్టు తప్పాయి అని తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోం దని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కన్నా ఈటెలకే ఈ ఎన్నికలు అత్యధిక ప్రాధాన్యం ఉంది. హుజురాబాద్ తరువాత ఈటెల చాలా స్పీడుగానే రాజకీయం నడుపుతున్నారు. తనని తాను బీజేపీ నాయకుడిగా ఫోకస్ చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. సొంత ఇమేజ్ నే నమ్ముకుని కేసీఆర్ పై పోరు సలుపుతున్నారు. కనుక కరీంనగర్ లో ఆయన పట్టు నిలుపుకునేందుకు చేసిన ప్రయత్నాలేవో ఫలితాలు ఇస్తాయా లేదా అన్న ఆసక్తి ఒకటి నెలకొని ఉంది.