వావ్ : తమిళ నాట స్టాలిన్ సంచలన నిర్ణయం ఏంటంటే?
కులం మతం అన్నవి వ్యక్తిగతం
కానీ ఇవే సమాజాన్ని శాసిస్తున్నాయి
కుల నిర్మూలన అన్నది జరగని పని
ఏనాటి నుంచో ఉన్న మాట
కానీ స్టాలిన్ తన నిర్ణయంతో కొంత మార్పునకు
కొత్త కదలికకు కారణం అయ్యారు..
ఆ నిర్ణయం ఏంటంటే?
తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుల నిర్మూలనలో ఆదర్శంగా నిలిచే గ్రామాలకు పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇచ్చేందుకు సమ్మత్తిస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేసి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు వెలువరించి తనదైన ముద్ర వేస్తున్న ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగు సీఎం పై ఆంధ్రా ప్రజలు సైతం ప్రేమ పెంచుకుంటున్నారు. ఆయన చేస్తున్న పనులను కోర్టులు కూడా తప్పు పట్టలేకపోతున్నాయి. బాగా పనిచేసే వారిని చేయనివ్వాలని అందుకు ఎవ్వరూ అడ్డు తగలకూడదని ఇటీవల ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఓ పిటిషనర్ కు హితవు చెప్పి మరీ పంపింది.
ఇక ఇప్పటికే దేశంలో మతం పేరిట కులం పేరిట కుతంత్రాలు కుట్రలూ అమలవుతున్న నేపథ్యాన స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఓ గొప్ప మార్పునకు సానుకూలం అయితే మేలు. కుల రహిత సమాజ నిర్మాణం అన్నది ధ్యేయం కావాలి అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఆ మాటకు అనుగుణంగా ఆ ఆశయాలకు అనుగుణంగా స్టాలిన్ పనిచేస్తున్నారన్నది అక్షర సత్యం. కులాలు నిర్మూలన అయిన కొత్త సమాజం వచ్చి అంతా సమానమే అన్న హక్కు ఒక్కటి అందరికీ వర్తింపజేస్తే మంచి మార్పు అన్నది సాధ్యం అయి తీరుతుంది. ఇప్పటికే అనేక వివక్షలు ఎదుర్కొన్న వెనుక బడిన, దళిత వర్గాల అభ్యున్నతికి గ్రామాలే పూనిక వహించాలి. గ్రామాలలో వివక్షరహిత సమాజ నిర్మాణానికి అంతా కృషి చేయాలి. ముఖ్యంగా దళిత వర్గాల ఉన్నతి సమృద్ధిగా నిధులు కేటాయించేందుకు పంచాయతీలు ముందుకు రావాలి. వారు నివసిస్తున్న కాలనీల అభివృద్ధికి పాటుపడాలి. ఇకపై స్టాలిన్ తీసుకునే ప్రతి నిర్ణయం అమలు అయ్యే దిశగా పంచాయతీలు తమని తాము సన్నద్ధం చేసుకోవాలి. కుల నిర్మూలన అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాటే కానీ అమలు మాత్రం సులువు కాదు. ఒకవేళ అదే కనుక జరిగితే అన్ని వర్గాలూ కలిసి మెలిసి సమాజ అభ్యున్నతికి తమవంతు కృషి చేయడం ఖాయం.